
మజ్లిస్, టీఆర్‌ఎస్ లోపాయికారీ ఒప్పందం
కేంద్రమంత్రి హన్స్‌రాజ్ అయ్యర్
సుల్తాన్‌బజార్: కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో గతంలో లోపాయికారి ఒప్పందం చేసుకోగా, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మజ్లిస్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకొని ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నాయని కేంద్రమంత్రి హన్స్‌రాజ్ అయ్యర్ అన్నారు. టీఆర్‌ఎస్ అబద్ధపు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. శుక్రవారం రాత్రి ఆయన బషీర్‌బాగ్‌లో గన్‌ఫౌండ్రీ డివిజన్ మాజీ కార్పొరేటర్ మధుగౌడ్, బీజేపీ గన్‌ఫౌండ్రీ అభ్యర్ధి సరితాగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపిస్తాయన్నారు. బీజేపీ దెబ్బకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు చిత్తుకావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ, టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, రఘునందన్‌యాదవ్, దినేష్‌యాదవ్, అనిల్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.