ఆ రెండు పార్టీలతో మతకల్లోలాలు
- బీజేపీ, ఎంఐఎంలతో తెలంగాణకు ప్రమాదం
- టీఆర్ఎస్ ఓ మాఫియా
- ప్రత్యర్థి పార్టీలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెండ్ మల్లు భట్టి విక్రమార్క్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: మతతత్వ పార్టీలైన బీజేపీ, ఎంఐఎంను గెలిపిస్తే హైదరాబాద్ నగరానికి, తెలంగాణ భవిష్యత్తుకు చాలా ప్రమాదమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మేయర్ తమే అంటున్న బీజేపీ, షహర్ హమారా-మేయర్ హమారా అంటున్న మజ్లిస్ పార్టీలు గెలిస్తే హైదరాబాద్‌లో మతోన్మాదం పెరిగిపోతుందన్నారు. లౌకికపార్టీగా కాంగ్రెస్ శాంతిభద్రతలకోసం చేసిన కషిని, తీసుకున్న చర్యలను నగర ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ మాఫియాతో హైదరాబాద్ నగరం అల్లాడుతోందని భట్టి ఆరోపించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌కు చేసిందేమిటని ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్ కు అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు వంటి భారీ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టినవేనని, అయితే హైదరాబాద్‌కు నీళ్లు వచ్చిన తర్వాత పైపుల ముందు కేటీఆర్ ఫోటోలు దిగి, పూర్తయిన మెట్రోరైలు ఎక్కి ప్రచారం చేసుకోవడం మినహా చేసిందేమీలేదని, తాజ్‌మహల్, చార్మినార్ ల ముందు నిలబడి ఫోటోలు దిగి తామే పూర్తిచేసినట్టుగా మంత్రి కేటీఆర్, టీఆర్‌ఎస్ ప్రచారం చేసుకుంటున్నాయని భట్టి ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే సెటిలర్లు పెద్ద ఎత్తున ఉన్న ప్రాంతాల్లో కూల్చివేతలకు దిగిన టీఆర్‌ఎస్‌ను మర్చిపోరని హెచ్చరించారు.
'తెలంగాణ వాలో జాగో- ఆంధ్రావాలో భాగో' అంటూ పెద్ద ఎత్తున బెదిరింపులకు దిగిన కేసీఆర్ ఇప్పుడు ఓట్లకోసం సెటిలర్లపై కపటప్రేమను చూపిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నగరంలో కూల్చివేతలు, తరలింపులు తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఎన్నికలు ఒక పార్టీకి సంబంధించినవి కావని, తెలంగాణ భవిష్యత్తుకోసం జరుగుతున్న ఎన్నికలు అని భట్టి అన్నారు. మతతత్వ పార్టీలైన బీజేపీ, ఎంఐఎం గెలిస్తే మతకల్లోలాలు జరుగుతాయని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ గెలిస్తే హైదరాబాద్‌లో అభివృద్ధిని, శాంతిభద్రతలను పట్టించుకోరని చెప్పారు. ‘కేసీఆర్‌కో బగావో- హైదరాబాద్‌కో బచావో’ అని భట్టి పిలుపును ఇచ్చారు. అభివృద్ధికోసం కట్టుబడిన లౌకికపార్టీ కాంగ్రెస్‌ని హైదరాబాద్ ప్రజలు గెలిపిస్తారని భట్టి చెప్పారు.