భూ బాగోతంపై విచారణ జరిపించండి
విజిలెన్స్ కమిషనర్‌కు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో ఎవరివో తెలియని భూముల(అన్ నోన్)ను అధికార పార్టీ నేతలు, సీఆర్‌డీఏలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కలసి పంచుకున్నారని, ఈ భూ బాగోతంపై సమగ్ర విచారణ జరిపించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విజిలెన్స్ కమిషనర్ ఎస్వీ ప్రసాద్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఎస్వీ ప్రసాద్‌కు ఆర్కే ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంతంలో కుంటలు, శ్మశానాలు, హక్కుదారులు ఎవరో తెలియని భూములు మొత్తం 500 ఎకరాల వరకు ఉన్నాయని ఆర్కే తెలిపారు.
కమిషనర్ స్పందిస్తూ సమగ్ర విచారణ జరిగేలా చూస్తానని హామీనిచ్చారు. ఫిర్యాదు కాపీని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ డీజీకి కూడా ఆర్కే పంపించారు. కాగా, సమస్యల నుంచి అవకాశాలు వెతుక్కుంటానని చెప్పే చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడంలో అవకాశాలు వెదుకుతున్నారని ఆర్కే విమర్శించారు. సచివాలయం వద్ద ఆయన మీడియాతో మాటాడారు. రాజధాని వ్యవహారాలపై శ్వేతపత్రాలు విడుదల చేసే దమ్ముందా? అని సూటిగా ప్రశ్నించారు.