సాక్షి, హైదరాబాద్
ప్రతిష్టాత్మక 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్తిగా చేతులెత్తేసింది. జనవరి మూడు నుంచి ఏడు వరకు ఓయూ వేదికగా నిర్వహించ తలపెట్టిన ఈ సదస్సును భద్రతా కారణాల వల్ల తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సదస్సు నిర్వహణ బాధ్యతల నుంచి ఉస్మానియా తప్పుకోవడంతో ఈ అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు ఏడు యూనివర్సిటీలు పోటీ పడగా, మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ అవకాశం దక్కింది. ఇంఫాల్ వేదికగా వచ్చే ఏడాది మార్చి 18 నుంచి 22 వరకు ఈ సదస్సు నిర్వహించనున్నట్లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రకటించింది. కాగా, సైన్స్ కాంగ్రెస్ కోసం పేర్లు నమోదు చేసుకున్న ప్రతినిధుల రిజిస్ట్రేషన్ ఫీజును రిఫండ్ చేయనున్నట్లు ఉస్మానియా వర్సిటీ ప్రకటించింది.
ఓయూకు ఎంతో నష్టం..
సైన్స్ కాంగ్రెస్ ఉస్మానియా నుంచి మణిపూర్ వర్సిటీకి తరలిపోవడం వల్ల ఓయూకు భారీ నష్టం వాటిల్లనుంది. అంతర్జాతీయంగా వర్సిటీ ప్రతిష్ట దిగజారడమే కాక వివిధ విభాగాలకు వచ్చే పరిశోధన ప్రాజెక్టులు రాకుండా పోయే అవకాశం ఉంది. అంతేకాదు ఇక్కడ పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసి ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ వివిధ దేశాల్లోని కార్పొరేట్ కంపెనీల్లో ఇంటర్వ్యూలకు, విదేశీ వర్సిటీల్లో
ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.
ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ..
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును కోరుతూ కొనసాగిన మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు కీలకపాత్ర పోషించారు. 2009 నుంచి 2014 వరకు వరుస ఆందోళనలతో వర్సిటీ అట్టుడికిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత వర్సిటీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఓయూ స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గత ఏప్రిల్‌లో స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంది. ఆ తర్వాత ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఒకటి రెండు ఘటనలు మినహా యూనివర్సిటీలో పెద్ద ఉద్రిక్త పరిస్థితులేమీ నెలకొనలేదు. స్వర్ణోత్సవాల స్ఫూర్తితో సైన్స్ కాంగ్రెస్‌ను కూడా విజయవంతం చేయాలని వర్సిటీ యంత్రాంగం భావించింది.
అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత..
గత ఆరు నెలల నుంచి 40 మందితో కూడిన బృందం సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. 20 ఏళ్ల తర్వాత ఓయూ వేదికగా నిర్వహిస్తున్న సదస్సు కావడంతో ఇక్కడ చదువుకుని దేశవిదేశాల్లో స్థిరపడిన అనేక మంది శాస్త్రవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు పంపడం సహా విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం విమాన టికెట్లు బుక్ చేసింది. అతిథుల వసతి కోసం నగరంలోని ప్రముఖ హోటళ్లలో 500 గదులు, రవాణా కోసం 700 క్యాబ్‌లు, 15,000 బ్యాగులు బుక్ చేసింది. ఆ మేరకు ఆయా కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు కూడా చెల్లించింది.
ఇప్పటికే పీజీ విద్యార్థులకు నెల రోజుల సెలవులు ప్రకటించింది. తీరా ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన తర్వాత శాంతి భద్రతల సమస్యను తెరపైకి తెచ్చి.. ప్రశాంతంగా ఉన్న క్యాంపస్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొంటూ సదస్సును వాయిదా వేసింది. సదస్సు నుంచి తప్పుకునేందుకు వర్సిటీ చూపిన ఈ శాంతిభద్రతల అంశం వర్సిటీకి మాయని మచ్చగా మిగలడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకంగా మారే ప్రమాదం లేకపోలేదు. కాగా, వీసీ చేతగానితనం వల్లే సైన్స్ కాంగ్రెస్ మణిపూర్‌కు తరలిపోయిందని, వీసీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్సిటీల బంద్‌కు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరవధిక బంద్‌కు పిలిపునిచ్చినట్లు ప్రకటించింది.
వీసీ వైఫల్యం వల్లే..
ప్రశాంతంగా ఉన్న వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు వీసీ ప్రకటించడం దారుణం. వర్సిటీ ప్రతిష్టను దేశవిదేశాల్లో ఇనమడింపజేయాల్సిన వీసీ ఇస్కాకు తప్పుడు నివేదిక ఇచ్చి దాని ప్రతిష్టను మరింత దిగజార్చారు. వర్సిటీ స్వయం ప్రతిపత్తిని సీఎంకు తాకట్టు పెట్టి, ఆయనకు తొత్తుగా మారానే. వీసీ వైఫల్యం వల్ల విద్యార్థులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.
– ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, అధ్యక్షుడు, ఔటా
దయచేసి నన్ను వదిలేయండి..
సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో.. దీనికి కారణాలేమిటో.. నాకంటే.. మీకే ఎక్కువ తెలుసు. ఈ విషయంలో ఇంతకన్నా నేనేం మాట్లడలేను. దయ చేసి..నన్ను వదిలేయండి
– ప్రొఫెసర్ రామచంద్రం, వీసీ, ఉస్మానియా వర్సిటీ
మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment