- ఛత్తీస్‌గఢ్ పోలీసుల నుంచి రాష్ట్ర పోలీసులకు సమాచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనాత్మక సంఘటనలకు పాల్పడడం ద్వారా తమ ఉనికి చాటుకునేందుకు మావోయిస్టు పార్టీ వ్యూహం రచించిందా.. ఇందుకోసం నలుగురు మంత్రులను, మరికొందరు అధికారులను టార్గెట్ చేసిందా... వారిని మట్టుబెట్టేందుకు యాక్షన్ టీమ్‌లను కూడా రంగంలోకి దించిందా... ఈ ప్రశ్నలకు విశ్వసనీయ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నా యి. ఈ మేరకు కొద్దిరోజుల కింద సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారుల నుంచి రాష్ట్ర పోలీసు అధికారులకు సమాచారం అందినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి తెలంగాణ ఏర్పాటయ్యాక ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తృతపర్చుకోవాలన్న మావోయిస్టుల ప్రయత్నాలను రాష్ట్ర పోలీసులు సమర్థంగా తిప్పికొట్టారు.
యూనివర్సిటీస్థాయిలో జరిగిన రిక్రూట్‌మెంట్ సమాచారాన్ని సేకరించి, అడ్డుకోగలిగారు. మరోైవెపు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసులను సమన్వయం చేసుకుని మావోయిస్టులు సరిహద్దు దాటి తెలంగాణలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఖమ్మం జిల్లా సరిహద్దులో, వరంగల్ జిల్లా ఏటూరునాగారం, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్లు జరిగాయని విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడి కొత్త రాష్ట్రంలో ఉనికి చాటుకునేందుకు మావోయిస్టు పార్టీ వ్యూ హం రచించిందని, ఛత్తీస్‌గఢ్ పోలీసుల నుంచి రాష్ట్ర పోలీసు అధికారులకు సమాచారం అందిందని తెలుస్తోంది.
నలుగురు మంత్రులు టార్గెట్?: మావోయిస్టుల ఎజెండాను అమలు చేస్తామని టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక జరిగిన ఎన్‌కౌంటర్లు, పోలీసు శాఖ ఆధునీకరణకు తీసుకున్న చర్యలతో మావోయిస్టులు ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. వరంగల్ జిల్లా ములుగు మండలం మల్లంపల్లి వద్ద మైనింగ్ వాహనాలను దహనం చేశారు. ఆ తర్వాత 2, 3 రోజులకే తాడ్వా యి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు శృతి, సాగర్ చనిపోయారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఉనికి చాటుకునేందుకు మంత్రులను టార్గెట్ చేసేం దుకు యాక్షన్ టీమ్‌లను పంపినట్లు అనుమానిస్తున్నారు. ప్రధానంగా నలుగురు మంత్రులను టార్గెట్‌గా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ పరిధిలోని ఒక మంత్రిని, దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు, ఉత్తర తెలం గాణకు చెందిన ఒక మంత్రి ఉన్నారని అంటున్నారు.
ఈ సమాచారం అందిన వెంటనే ఆయా మంత్రులను అప్రమత్తం చేసిన పోలీసు ఉన్నతాధికారులు... వారి పర్యటనల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చినట్లు చెబుతున్నారు. దీనివల్లే ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి ఇటీవల తన పర్యటనలు పూర్తిగా తగ్గించుకుని, పట్టణ ప్రాంతానికే పరిమితమయ్యారని పేర్కొంటున్నారు. గతంలో తన శాఖ పనులను పరిశీలించేందుకు ఆ మంత్రి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారని, ఇటీవల పూర్తిగా తగ్గించుకున్నారని అంటున్నారు.
మరో ముగ్గురిపైనా..: రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి కృషి చేసిన ఇద్దరు ఐపీఎస్ అధికారులపైనా వారు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందులో ఒకరు మాజీ డీజీపీ కాగా.. మరో అధికారి ఇంకా సర్వీసులో ఉన్నారని చెబుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్థాయిలో సహకరించి ఎప్పటికప్పుడు మావోయిస్టుల సమాచారాన్ని చేరవేస్తున్న ఓ మాజీ నక్సలైట్‌ను కూడా హతమార్చేందుకు యాక్షన్ టీమ్‌లు రంగంలోకి దిగాయని అంటున్నారు.
మంత్రులపై మావోయిస్టుల గురి?
Published Tue, Jul 5 2016 2:03 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM
Advertisement
Advertisement