ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
హైదరాబాద్: నిర్లక్ష్యం, నిర్వీర్యానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, పటిష్టపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఇందులో భాగంగానే కేజీ టు పీజీ విద్యను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతోందన్నారు. అయినా అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, అది పూర్తిస్థాయిలో అమలు జరగాలంటే మరో రెండేళ్ల సమయం పడుతుందని అన్నారు. సోమవారం సాయంత్రం రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ(ఆర్‌సీటీఏటీ) హైదరాబాద్ తిలక్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయ ప్రారంభోత్సవంలో శ్రీహరి మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. విద్యావ్యవస్థను పటిష్ట పరిచేందుకు విశ్రాంత ఉపాధ్యాయులు సేవలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సీబీఎస్‌ఈ సిలబస్‌తో కూడిన రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారని, ఈ నెల 14న మరికొన్ని రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుపై సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.
మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ కేజీ టు పీజీ విద్యను స్వాగతిస్తున్నామని, దీనిని నిర్ధిష్టమైన ప్రణాళికతో అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆర్‌సీటీఏటీ అధ్యక్షుడు సీహెచ్ విద్యాసాగర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో విశ్రాంత ఉద్యోగుల సేవలు ఉపయోగించుకోవాలని, తమ సేవలకు ఎలాంటి వేతనం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ పి. సుధాకర్‌రెడ్డి, ఏఐఎప్‌ఆర్‌యూసీటీఏ ప్రధాన కార్యదర్శి కేటీ వెంకటాచార్యులు, ఆర్‌సీటీఏటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కేఎస్‌ఎన్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యావ్యవస్థ పటిష్టానికి చర్యలు
Published Tue, Apr 12 2016 4:04 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM
Advertisement
Advertisement