‘గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతో అనుభవజ్ఞులు. మిమ్మల్ని సవాల్ చేసేంత అనుభవం గానీ వయసు గానీ నాకు లేదు. నేను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన వాణ్ణి.
సీఎంకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ‘గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతో అనుభవజ్ఞులు. మిమ్మల్ని సవాల్ చేసేంత అనుభవం గానీ వయసు గానీ నాకు లేదు. నేను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన వాణ్ణి. దేనికైనా ‘సై’ అనే మీరు రాజధాని భూముల వ్యవహారంలో ఎందుకో ‘నై’ అంటున్నారు. ఇందులోని చిదంబర రహస్యమేమిటో నాకు తెలియడం లేదు సీఎంగారూ..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కె.శ్రీధర్‌రెడ్డి సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటూ ఆయన వినూత్నశైలిలో ముఖ్యమంత్రికి ఈ విజ్ఞప్తి చేశారు.
అధికార పక్షమైన టీడీపీ వాదోపవాదాలు చూస్తుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారో లేక వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ ఉన్నారోనన్న అనుమానం కలుగుతోందన్నారు. ఏపీలోని రాజధాని భూముల దందాలో రికార్డులు కావాలనుకుంటే చిటికెలో పనని, ఆ రికార్డులు ఎక్కడో అమెరికాలోనో, రష్యాలోనో లేవని చెప్పారు. అగ్రిజోన్ల మార్పిడి రికార్డులను చిటికెలో తెప్పించుకోవచ్చన్నారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందో అక్కడ కొన్న భూములు రాజధాని ప్రకటనకు ముందు కొన్నవేనని, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి సన్నిహితులు, అనుయాయులకు రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసని, అందుకే ఆ ప్రాంతంలో భూములు కొన్నారని అంటుండగా స్పీకర్ కోడెల మైక్ కట్ చేశారు. దీంతో సభలో విపక్ష సభ్యులు స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం స్పీకర్ తిరిగి మైకు ఇచ్చారు. అప్పుడు శ్రీధర్‌రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇందుకు సంబంధించిన ఆధారాలు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయని, అందుకే ఆరోపణలు చేస్తున్నామని చెప్పారు. అందువల్ల ఈ భూముల దందాపై జ్యుడిషియల్ లేదా సీబీఐ విచారణకు ఆదేశించి చంద్రబాబు తాను నిష్కళంకుడినని నిరూపించుకోవాలని సూచించారు. తక్షణమే విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.