గ్రీన్ సిగ్నల్ ఎప్పుడో! | MPs meeting today on railway projects | Sakshi
Sakshi News home page

గ్రీన్ సిగ్నల్ ఎప్పుడో!

Published Wed, Jan 7 2015 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

గ్రీన్ సిగ్నల్  ఎప్పుడో!

గ్రీన్ సిగ్నల్ ఎప్పుడో!

రైల్వే ప్రాజెక్టులపై నేడు ఎంపీల సమావేశం
 
నగరంలో రైల్వే ప్రాజెక్టులపై తొలగని ప్రతిష్టంభన
ప్రతిపాదనకే పరిమితమైన విమానాశ్రయానికి రైలు మార్గం
చర్చల్లోనే భారీ టర్మినళ్లు
ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలపై కొరవడిన పురోగతి
రైల్‌నిలయంలో నేడు ఎంపీల సమావేశం

 
సిటీబ్యూరో : నగరంలో  చేపట్టిన రైల్వే ప్రాజెక్టుల పురోగతి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగానే ఉంది. కొన్ని ప్రాజెక్టులు  ప్రతిపాదనలకే పరిమిత మైతే మరికొన్ని చ ర్చల దశను కూడా దాటడం లేదు. మరోవైపు  ప్రారంభించిన ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. వచ్చే నెలలో  ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ దృష్ట్యా పార్లమెంట్ సభ్యుల నుంచి ప్రతిపాదనలు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు  దక్షిణమధ్య రైల్వే బుధవారం  ఎంపీల సమావేశానికి శ్రీకారం చుట్టింది. ఈ సమావేశంలో  తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టులు, ప్రతిపాదనలు, పనుల పురోగతితో పాటు, కొత్తగా చేపట్టవలసిన వాటిపైనా చర్చ జరిగే  అవకాశం ఉంది. ఈ  క్రమంలోనే  హైదరాబాద్‌లో  గతేడాది ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు, నగర శివార్లలో  నిర్మించాలని ప్రతిపాదించిన  భారీ టర్మినళ్లపైన ఈ సమావేశం గుణాత్మకమైన పురోగతిని సాధించగలిగితే  ఇప్పటికే ప్రారంభించిన పనుల్లో  కొంత వేగం పెరిగే అవకాశం ఉంది.

విమానాశ్రయానికి రైలు మార్గం...

ప్రతిష్టాత్మకమైన  ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ప్రారంభమయ్యాయి. పటాన్‌చెరు-తెల్లాపూర్, మేడ్చల్-బోయిన్‌పల్లి మార్గాల్లో పనులు జరుగుతున్నాయి. కానీ  హైదరాబాద్ ప్రయాణికులు అతి తక్కువ  టిక్కెట్ చార్జీలతో  శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి  చేరుకొనేందుకు  ప్రతిపాదించిన రైలు మార్గంపైన మాత్రం ఏడాది కాలంగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఉందానగర్ నుంచి విమానాశ్రయం వరకు 6 కిలోమీటర్లు కొత్తగా లైన్‌లు వేయవలసి ఉంది. కానీ జీఎమ్మార్ అందుకు నిరాకరిస్తోంది. విమానాశ్రయం లోపలి వరకు కాకుండా  3 కిలోమీటర్ల వరకే అనుమతినిస్తామని చెప్పడంతో  ప్రతిష్టంభన చోటుచేసుకుంది. దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు  తీసుకోలేదు. బుధవారం నాటి ఎంపీల సమావేశంలోనైనా  ఈ అంశంపై  సమగ్రంగా చర్చించి విమానాశ్రయానికి  రైలు మార్గానికి అడుగులు పడితే మంచిది.

భారీ టర్మినళ్లు...

ఉత్తర, దక్షిణభారత దేశానికి మధ్య ప్రధాన కేంద్రబిందువుగా  ఉన్న హైదరాబాద్‌కు రైళ్ల తాకిడి  బాగా ఉంది. ప్రతి రోజు వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి  లక్షలాది మంది ప్రయాణికులు  వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న రైళ్ల ఒత్తిడి దృష్ట్యా  2005లోనే సికింద్రాబాద్‌లో వరల్డ్‌క్లాస్ రైల్వేస్టేషన్ నిర్మించాలని ప్రతిపాదించారు. పలు మార్లు బడ్జెట్‌లలో కూడా ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. రైళ్ల ఒత్తిడిని తగ్గించేందుకు మౌలాలి, వట్టినాగులపల్లిలో రెండు భారీ ప్రయాణికుల టర్మినళ్లను కట్టించాలనే ప్రతిపాదనలకు రాష్ట్రప్రభుత్వం కూడా  అంగీకరించినప్పటికీ భూముల కేటాయింపుపై ఎలాంటి చర్యల్లేవు.

ఆర్‌ఓబీ, ఆర్‌యూబీలు...

నగరంలోని తుకారాంగేట్, ఆనంద్‌బాగ్, సఫిల్‌గూడ, ఉప్పుగూడ, కందికల్‌గేట్, ఆలుగడ్డబావి తదితర ప్రాంతాల్లో ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మించాలని ప్రతిపాదించారు. కొన్ని చోట్ల పనులు నత్తనడకన సాగుతుండగా, మరికొన్ని చోట్ల  ఇంకా  ప్రారంభానికి నోచుకోలేదు. మరోవైపు ఆరు నెలల క్రితమే ఆలుగడ్డ బావి వద్ద పనులు పూర్తయినప్పటికీ  దానికి అనుబంధంగా రోడ్లు వేయకపోవడం వల్ల  ప్రజలకు అందుబాటులోకి రాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement