సాక్షి, నల్లగొండ: అనుకున్నదే జరిగింది. మధ్యంతర రైల్వే బడ్జెట్‌లో జిల్లా ప్రజలకు నిరాశే మిగిలింది. ఏళ్లుగా వస్తున్న వివక్షే పునరావృతమైంది. బియ్యం, పలుగురాళ్లు, సిమెంటు తదితర ఎగుమతుల ద్వారా ఏడాదికి రూ.170 కోట్లకు పైగా ఆదాయం జిల్లా నుంచి రైల్వేశాఖకు వెళ్తున్నా.. నిధులు విదిల్చడంలో మాత్రం మొండిచేయే ఎదురైంది. జిల్లాలో సుదీర్ఘకాలంగా ప్రతిపాదనలకే పరిమితమైన రైల్వే ప్రాజెక్టులపై రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే చిన్నచూపు చూశారు. కొత్త రైల్వే ప్రాజెక్టులు, కొత్త మార్గాలు, డబ్లింగ్, విద్యుదీకరణల ఊసేలేదు. ఈ మధ్యంతర బడ్జెట్‌పై జిల్లా ప్రజలు పెదవివిరుస్తున్నారు.
అటకెక్కిన ప్రతిపాదనలు...
జిల్లా పరిధిలో చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ సారీ చేదు అనుభవమే ఎదురైంది. విద్యుదీకరణతో కూడిన డబుల్ లైన్‌ను బీబీనగర్ నుంచి నడికుడ వరకు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయినా పాలకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. నల్లగొండ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం వరకు 100 కిలోమీటర్ల మేర రైలుమార్గం వేయాలన్న ప్రతిపాదన ఏళ్లనాటిది. దీన్ని పూర్తి చేయడానికి రూ. 600 కోట్లు అవసరం అవుతాయని అంచనాలు సిద్ధం చేసినా అడుగు ముందుకు పడలేదు. వరంగల్ జిల్లా ఖాజీపేట నుంచి సూర్యాపేట మీదుగా నల్లగొండకు కొత్తరైలు మార్గం ఏర్పాటు విషయమై 2006లో పార్లమెం టులో చర్చ జరిగింది. సర్వే చేపట్టేందుకు అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఆమోదించారు.
దీనిపై ఈ సారి బడ్జెట్‌లోనూ నిరాశే ఎదురైంది. యాదగిరిగుట్టకు రైలు మార్గం కోసం ప్రయాణికులు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. నిత్యం రాజధాని, భువనగిరి నుంచేగాక పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. వీరికి సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. రాయచూర్ నుంచి గద్వాల, నాగర్‌కర్నూల్, దేవరకొండ, నాగార్జునసాగర్ మీదుగా జిల్లా కేంద్రానికి రైలు మార్గం ఏర్పాటు కలగా మిగిలిపోయింది.
తీరని కష్టాలు...
నల్లగొండ మీదుగా రైలులో వెళ్లాలంటే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నిత్యం 12 రైళ్లు 24సార్లు రాకపోకలు సాగిస్తున్నా.... ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదు. కొన్ని సమయాల్లో కాలు పెట్టడానికీ స్థలం దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. పుట్‌బోర్డ్ ప్రయాణంతో ప్రయాణికులు బెంబేలె త్తున్నారు. గుంటూరు, విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లు... జిల్లాకేంద్రానికి రాక ముందే కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి జిల్లామీదుగా మిర్యాలగూడ వరకు వెళ్లే ప్యాసింజర్ రైలును ఇటీవల నడికుడ వరకు పొడిగించారు. దీంతో రైలు తిరిగి జిల్లా కేంద్రానికి వచ్చేలోగా అప్పటికే ప్రయాణికులతో బోగీలు నిండుకుంటున్నాయి.
జిల్లాకు తీరని అన్యాయం : నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి
రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగింది. రాష్ట్రంలో రైలుమార్గం నిడివి అతితక్కువ ఉన్న జిల్లాపై శీతకన్ను ప్రదర్శించారు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ ఊసేలేదు. బీబీనగర్ నుంచి నడికుడి వరకు డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌కు సర్వే చేస్తామని ప్రకటించినా నిధులు ఎందుకు కేటాయించలేదు. జాతీయ రహదారి వెంట విజయవాడకు లైన్ వేయాల్సి ఉన్నా ఆ దిశగా ఆలోచించలేదు. జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా నిధుల కేటాయింపుల్లో విఫలమయ్యారు.
సామాన్యుల సమస్యలు పట్టని సర్కార్ :
నజీరుద్దీన్,
బడ్జెట్‌లో నిరుపేద, సామాన్య ప్రజలు, వృద్ధులు, వికలాంగుల సమస్యలు ప్రస్తావనకే రాలేదు. అరకొరగా జిల్లాకు వస్తున్న రైళ్లలో నిల్చోవడానికీ స్థలం ఉండడం లేదు. గతంలో మంజూరు చేసిన ప్రాజెక్టులు, కొత్తమార్గాలు, డబ్లింగ్, విద్యుదీకరణ తదితర పనులకు నిధుల కేటాయింపులో తీవ్రంగా విఫలమయ్యారు. మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించాలన్న అంశం చర్చకే రాలేదు. జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు పలుమార్లు విజ్ఞప్తులు పంపినా మంత్రులు వాటిని పెడచెవిన పెట్టారు. ఏళ్లు గడుస్తున్నా జిల్లా రైల్వే ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేవు.
రెడ్ సిగ్నల్..
Published Thu, Feb 13 2014 3:54 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement