
గ్రేటర్‌కు కొత్త జిలుగు
సాక్షి, సిటీబ్యూరో:విద్యుత్ పొదుపు.. ఆదాయం మదుపు చేస్తూనే వెలుగు జిలుగుల నగరాన్ని ఆవిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం రాష్ట్రంలోనే తొలిసారి ఇండక్షన్ ల్యాంప్‌ల వినియోగానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఒకటి రెండు ప్రాంతాల్లో 50 రోజుల పాటు ఈ దీపాల్ని వినియోగించి విద్యుత్ పొదుపును అంచనా వేసిన జీహెచ్‌ఎంసీ.. క్రమేపీ వాటిని నగరమంతా ఏర్పాటు చేయడం ద్వారా ఇతర కార్పొరేషన్లలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు మార్గదర్శకం కానుంది.
రోజు రోజుకూ తీవ్రమవుతున్న విద్యుత్ కొరత .. పొదుపు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రచారాల నేపథ్యంలో విద్యుత్ డిమాండ్‌ను తగ్గించడంతోపాటు, చార్జీల భారాన్ని తగ్గించుకునేందుకు ఇవి ఉపకరిస్తాయని జీహెచ్‌ఎంసీ అంచనా వేస్తోంది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఈస్ట్‌జోన్‌లో ప్రయోగాత్మకంగా ఒక ల్యాంప్ ద్వారా 50 రోజులకు ఆదా అయ్యే విద్యుత్‌ను లెక్కగట్టింది. సంప్రదాయ విద్యుత్ బల్బుల స్థానంలో ఇండక్షన్ ల్యాంపుల వాడకంవల్ల తక్కువ ఖర్చుతోపాటు, ప్రశాంతమైన వెలుతురు అందుతుందని గుర్తించింది.
దీంతో నగరమంతా వీటిని ఏర్పాటుచేస్తే వీధిదీపాల విద్యుత్ ఖర్చుల కింద జీహెచ్‌ఎంసీ ఏటా చెల్లిస్తున్న కోట్ల రూపాయల్లో ఎంతో పొదుపు చేయవచ్చునని భావించింది. తొలి దశలో జీహెచ్‌ఎంసీకి చెందిన ఫ్లైఓవర్ల మార్గాల్లో దాదాపు 200 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ మేరకు కాంట్రాక్టుకు టెండర్లు పిలవనున్నారు.
ప్రయోజనాలివీ...
ఎలక్ట్రోడ్స్, ఫిలమెంట్స్ కంటే వీటి జీవిత కాలం రె ట్టింపు
హైమాస్ట్ లైట్లపై మూడు నెలలకోమారు నిర్వహణ భారం ఉంటుండగా, వీటిపై
అదేమీ ఉండదు (కాంట్రాక్టు కనీస కాలపరిమితి ఐదేళ్లు)
ఇండక్షన్ ల్యాంప్‌ల సగటు జీవిత కాలం లక్ష గంటలు. ఈ లెక్కన దాదాపు 20 ఏళ్ల వరకు బల్బులు మార్చాల్సిన పనిలేదు
విద్యుత్ వినియోగ భారం 60 శాతం తగ్గుతుంది
పర్యావరణహితమైన ఈ దీపాలను ఎన్నేళ్లు వినియోగించినా కాంతి తగ్గదు. ప్రశాంతమైన వెలుతురు వల్ల కళ్లకు హాని కలగదు
ఓల్టేజి హెచ్చుతగ్గుల్ని తట్టుకునే సామర్థ్యం గలవి
ఒక వాట్ సంప్రదాయ బల్బుల కన్నా దీని వెలుతురు ఎక్కువ
ఇదీ ప్రయోగ ఫలితం..
ఈస్ట్ జోన్‌లో 50 రోజుల పాటు ప్రయోగాత్మకంగా వినియోగించి చూడగా హైమాస్ట్ బల్బు కంటే ఇండక్షన్ బల్బు వల్ల 230 యూనిట్ల విద్యుత్ వినియోగం తగ్గింది. అంటే సగటున రోజుకు 4.6 యూనిట్లు తగ్గింది. జీహెచ్‌ఎంసీ వీధిదీపాలకు చెల్లిస్తున్న చార్జీలను పరిగణనలోకి తీసుకుంటే, ఏడాదికి ఒక్క ల్యాంపు ద్వారా రూ.10,549 తగ్గుతాయి. కాంట్రాక్టు కొనసాగే ఐదేళ్లలో ఒక్క బల్బుకే రూ. 52,745 తగ్గుతాయి.
ఈస్ట్‌జోన్‌లో ప్రస్తుత మాస్ట్ లైట్ల స్థానే ఇండక్షన్ ల్యాంప్‌లను వాడితే ఏడాదికి 14,50,656 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని అంచనా. తద్వారా జీహెచ్‌ఎంసీకి రూ.92,40,679 విద్యుత్ చార్జీలు అదా అవుతాయి. 50 శాతం మేర సిస్టం లోడ్ తగ్గుతుంది. 16,236 మోడర్న్ లైటింగ్ ల్యాంపుల స్థానంలో ఇండక్షన్ ల్యాంపుల్ని వాడితే ఏటా దాదాపు రూ. 2.71 కోట్ల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి.