‘కార్పొరేట్’లో ఉచిత ఓపీ లేనట్టే!
నిమ్స్ ప్యాకేజీ’ కోరిన ఆసుపత్రులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ ఉచిత వైద్య సేవలకు సంబంధించి ఏడాదిన్నరగా పరిష్కారం కావడంలేదు. నగదు రహిత ఆరోగ్య కార్డుల కింద ఉద్యోగులకు కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యంపై బుధవారం సచివాలయంలో ఆసుపత్రుల యాజమాన్యాలతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కానీ పూర్తిస్థాయి పురోగతి సాధించకుండానే సమావేశం ముగిసింది. ఔట్ పేషెంట్(ఓపీ) వైద్య సేవలను ఉచితంగా చేయబోమని, ఇది తమకు ఏమాత్రం గిట్టుబాటుకాదని కార్పొరేట్ ఆసుపత్రులు స్పష్టం చేసినట్లు వైద్య మంత్రి కార్యాలయం తెలిపింది.
వాస్తవంగా ఉద్యోగులు ఏదైనా ఆరోగ్య పరీక్ష చేసుకోవాలంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో కన్సల్టేషన్ ఫీజు, ఇతర పరీక్షల ఫీజు తడిసి మోపెడవుతుంది. ఇది ఉచితంగా లేకుంటే నగదు రహిత ఆరోగ్య కార్డుల వల్ల ప్రయోజనం ఏమిటనేది ఉద్యోగుల ప్రశ్న. ఉచిత ఓపీ సేవలు కాకుండా ఉద్యోగులకు ఏడాదికి రూ.5 వేల చొప్పున ఓపీ అలవెన్స్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో సర్కారుంది. కానీ అది ఏమూలకూ సరిపోదని ఉద్యోగులు అంటున్నారు. ఓపీ సేవల కోసం ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచించినా అది ఆచరణ సాధ్యం కాదన్న అభిప్రాయమూ ఉంది.
ఆపరేషన్ల ప్యాకేజీ 40 శాతం పెంపునకు అంగీకారం
వివిధ ఆపరేషన్లకు గాను ప్రస్తుతమున్న ప్యాకేజీని 40 శాతం పెంచడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీనిపై ఇరు వర్గాలకు ఎటువంటి వివాదం లేదు. మెడికల్ ప్యాకేజీని నిమ్స్ మిలీనియం ప్యాకేజీ ప్రకారం ఇవ్వాలని కార్పొరేట్ ఆసుపత్రి వర్గాలు కోరుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు, వైద్య పరీక్షలకు సంబంధించి అవసరమైతే ఉద్యోగులు ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అడుగు ముందుకు పడలేదు.
నిమ్స్ మాదిరి మెడికల్ ప్యాకేజీ, ఓపీకి సొమ్ము చెల్లించాలని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం (టీషా) కోరుతోంది. దీనికి అంగీకరిస్తే మెడికల్ ప్యాకేజీ, ఓపీలకే రూ. 500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని సర్కారు అంచనా. ఓపీ సేవలు ఉచితమైతే ఉద్యోగులు అవసరమున్నా లేకున్నా వైద్య పరీక్షలు చేయించుకుంటారన్నది ప్రభుత్వం, కార్పొరేట్ ఆసుపత్రుల వాదన. అయితే, వచ్చే దసరా నుంచి ఉద్యోగులకు ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. అప్పటిలోగా ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు.