ప్రాంతీయ పార్టీలతో అభివృద్ధి జరగదు
కుటుంబ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలి: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రాభివృద్ధి జరగదని, కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు సక్రమంగా అమలు కావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ప్రాంతీయ పార్టీలకు ప్రజాసంక్షేమం కంటే కుటుంబ సంక్షేమమే ముఖ్యమన్నారు. యూపీలో సమాజ్‌వాదీ ప్రభుత్వం కుటుంబ కలహాలతో బజారుకెక్కిందన్నారు. కుటుంబ పార్టీలు ఎక్కడున్నా అదే జరుగుతుందని, ప్రజలు జాగురుకతతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ వంద రోజుల ప్రణాళిక... రూ.వంద కోట్ల స్వాహాకు దారితీసిందన్నారు. నగరంలో చిన్న వాన వచ్చినా నదుల మాదిరిగా పరిస్థితి తయారవుతోందన్నారు.
మంగళవారం పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ సమక్షంలో పలువురు టీడీపీ, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తుంటే, సీఎం కేసీఆర్ మాత్రం సచివాలయానికి రారని, ఫామ్‌హౌస్, క్యాంప్ ఆఫీసుల నుంచే పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
కేంద్రం రాష్ట్రానికి 85 వేల ఇళ్లు కేటాయించినా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కేజీ టూ పీజీ విద్య, దళితులకు 3 ఎకరాలు తదితర హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.3,060 కోట్లు, ఆరోగ్యశ్రీ రూ.430 కోటల బకాయిలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే వాస్తు పేరిట కొత్త సెక్రటేరియట్ భవనాలకు రూ.350 కోట్లు వెచ్చించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. శ్వాస ఫౌండేషన్ రూపొందించిన ‘స్వచ్ఛ దివాళి-సేప్ దివాళి’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.