♦ పాత ఎంపీడీవోలకే అభివృద్ధి బాధ్యతలు
♦ జెడ్పీ సీఈవోలను ఆదేశిస్తూ సర్కారు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: కొత్త మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పోస్టులు సృష్టించే ప్రతిపాదనకు ప్రభుత్వం మంగళం పాడింది. ఆయా మండలాల్లోని గ్రామాలు ప్రస్తుతం ఏ మండల పరిధిలో ఉన్నాయో ఆ మండల పరిషత్ అభివృద్ధి అధికారి నేతృత్వంలోనే పనులు చేపట్టేందుకు నిర్ణయించింది. వివిధ మండలాల పరిధిలోని గ్రామాలతో కొత్త మండలాలు ఏర్పాటు చేసినందున, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ అధికారిని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా అభివృద్ధి పనుల బాధ్యతలు అప్పగించాలని సర్కారు భావించింది. ఈ మేరకు కొత్తగా ఏర్పడిన 125 మండలాలకు ఓఎస్డీల నియామకం జరగాల్సి ఉంది.
అయితే.. రాజ్యంగంలోని ఆర్టికల్ 243 (ఇ) ప్రకారం ప్రస్తుత మండల, జిల్లా పరిషత్ వ్యవస్థలను మార్చేందుకు వీలుకానందున ఆయా వ్యవస్థలను వాటి పదవీకాలం పూర్తయ్యే వరకు అలాగే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మండలాల్లోని గ్రామాల్లో వాటి పూర్వ మండల పరిషత్తుల ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. కొత్త మండలాల్లోని గ్రామాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను పాత మండలాల ఎంపీడీవోల ద్వారానే నిర్వహించాలని, ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లా పరిషత్‌ల ముఖ్య కార్య నిర్వహణాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.