కేంద్ర మంత్రి సుజనాకు అరెస్టు వారంట్
హాజరు కావాలని ఆదేశించినా నిర్లక్ష్యం చేశారంటూ కోర్టు ఆగ్రహం
తదుపరి విచారణ 26కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: మారిషస్ బ్యాంకు నుంచి రుణం తీసుకుని మోసగించిన కేసులో టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి, సుజనా సంస్థల అధినేత సుజనా చౌదరికి నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డానీ రూత్ గురువారం ఈ మేరకు వారంట్లు జారీ చేశారు. సహేతుకమైన కారణాలు లేకుండానే హాజరు నుంచి తప్పించుకోవాలని సుజనా చూస్తున్నారంటూ మారిషస్ బ్యాంకు తరఫు న్యాయవాదులు సంజీవ్‌కుమార్, కనకమేడల శాతకర్ణి చేసిన వాదనతో ఏకీభవించారు. ‘‘పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాల్సి ఉందని మౌఖికంగా తెలుపుతూ మార్చి 22న హాజరు నుంచి సుజనా మినహాయింపు కోరారు. కానీ పిటిషన్లోమాత్రం పార్లమెంటులో పని ఉన్నందున కోర్టు ముందు హాజరు కాలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడేమో తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు ఆదేశించినా, మంత్రివర్గ సమావేశముందంటూ మరో కారణం చూపుతూ మినహాయింపు కోరుతున్నారు.
సుజనా సహాయ మంత్రి మాత్రమే. సహాయ మంత్రులు మంత్రివర్గ సమావేశంలో పాల్గొనరు. అయినా ఆయన ఉద్దేశపూర్వకంగానే కోర్టుకు హాజరు కాకుండా రకరకాల కారణాలతో తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ రోజు (గురువారం) తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని ఏప్రిల్ 1వ తేదీనే కోర్టు ఆదేశించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మినహాయింపు కోరుతున్నారు. రకరకాల పిటిషన్లు వేయడం ద్వారా ఈ కోర్టు ముందు హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను పాటించనందుకు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం అరెస్టు వారెంట్లు జారీచేయండి’’ అంటూ వారు చేసిన విజ్ఞప్తి మేరకు సుజనాకు న్యాయమూర్తిఅరెస్టు వారెంట్లు జారీచేశారు. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ ఎండీ శ్రీనివాసరాజు, డెరైక్టర్ హనుమంతరావు కోర్టు ముందు హాజరై రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించారు.