కదలని ఈ-పాస్
♦ రేషన్ దుకాణాల్లో ప్రకటనలకే పరిమితమైన యంత్రాల ఏర్పాటు
♦ డీలర్ల ఒత్తిడితో ఎటూ తేల్చలేక పోతున్న పౌర సరఫరాల శాఖ
సాక్షి, హైదరాబాద్: ‘రేషన్‌కార్డుల డిజిటలైజేషన్, వంద శాతం ఆధార్ సీడింగ్ ద్వారా బోగస్ కార్డులను ఏరివేసినట్లే... మరింత సాంకేతికతను వినియోగంలోకి తెచ్చి రేషన్ లీకేజీలకు అడ్డుకట్ట వేస్తాం. రంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాల ద్వారా 10శాతం బోగస్‌ను నివారించగలిగాం. ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టి అక్రమాలను నివారిస్తాం..’.. దాదాపు ఏడాది కింద ప్రభుత్వం చేసిన ప్రకటన ఇది. ఆ ప్రకటనకు తగ్గట్టే అడుగు ముందుకు వేసిన ప్రభుత్వం... డీలర్ల ఒత్తిళ్లు, మధ్యలో వచ్చిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ-పాస్ యంత్రాలపై వెనక్కి తగ్గింది. గతేడాది ఆగస్టు నాటికే పూర్తికావాల్సిన ఈ ప్రక్రియ ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం.
సబ్సిడీ పక్కదారి పట్టకుండా..
రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ. 2,200 కోట్ల సబ్సిడీని భరిస్తూ పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తోంది. రూపాయికి కిలో బియ్యం, రూ15కే లీటర్ కిరోసిన్‌తో పాటు గోధుమలు, చక్కెర, కందిపప్పు వంటివీ సరఫరా చేస్తోంది. అయితే పేదలకు అందాల్సిన సరుకులను డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఏటా బియ్యం అక్రమాల ద్వారా రూ.150కోట్ల మేర అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి.
కిరోసిన్, గోధుమలు, కందిపప్పు సైతం పక్కదారి పడుతున్నాయని పేర్కొన్నాయి. ఇలా ఏటా వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుండడంతో... దీన్ని కట్టడి చేయడానికి రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈపాస్ యంత్రాల ఏర్పాటును తెరపైకి తెచ్చింది. సుమారు రూ.230కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17వేలకు పైగా రేషన్ దుకాణాల్లో వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతేడాది జూన్‌నాటికే ఏర్పాటు చేయాలని భావించారు. కానీ టెండర్ల ప్రక్రియలో జాప్యంతో ఆలస్యమైంది.
డీలర్ల వ్యతిరేకత...
డీలర్లు ఈ-పాస్‌పై తొలి నుంచి నిరాసక్తంగా ఉన్నారు. పౌరసరఫరాల శాఖ గత నెలలో సర్కిల్ వారీగా ఈ-పాస్ యంత్రాలపై శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే దాన్ని బహిష్కరించారు. యంత్రాలు అందుబాటులో ఉం చినా వాటిని తీసుకునేందుకు ముందుకు రాలే దు. సంబంధిత అధికారులు డీలర్లకు బలవంతంగా ఈ-పాస్ యంత్రాలను అప్పజెప్పినా..పాత పద్దతిలోనే సరుకులు పంపిణీ చేస్తున్నా రు. మరోవైపు డీలర్ల సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి అధికమైంది. దీనికి స్థానిక నేత లు సైతం జత కలవడంతో ఈ-పాస్ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. దాంతో అక్రమాలు యధావిధిగా కొనసాగుతున్నాయి.