- డీజీపీ ప్రతిపాదనలను పైరవీలతో పక్కన పెట్టించిన అదనపు ఎస్పీలు
- హోంశాఖ వద్దే నిలిచిపోయిన అధికారుల బదిలీ ఫైలు
- రసవత్తరంగా మారిన 9 మంది అదనపు ఎస్పీల బదిలీ
- పలు జిల్లాలు, జోన్లకు పోస్టింగ్స్ కల్పిస్తూ డీజీపీ ప్రతిపాదనలు
- తమకు అవకాశం కల్పించకపోవడంతో తొక్కిపెట్టిన వైనం
సాక్షి, హైదరాబాద్: ఆయన రాష్ట్ర పోలీసు బాస్. ఆయనిచ్చే ఆదేశాలకు తిరుగుండదు. కానీ కొంత మంది అధికారులు తమ పైరవీలు, లాబీలతో ఏకంగా డీజీపీ ప్రతిపాదనలను పక్కన పెట్టించారు. ఇప్పుడు ఈ వ్యవహారం పోలీస్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కొంతమంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. ఆ పదోన్నతి పొందిన అధికారుల స్థానాల్లో పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో 9 మంది అదనపు ఎస్పీ స్థాయి అధికారులను ప్రతిపాదిస్తూ డీజీపీ వారం రోజుల క్రితం హోంశాఖకు ఫైలు పంపారు.
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ, వికారాబాద్ ఎస్పీ, ఎల్బీనగర్ డీసీపీ, ఈస్ట్ జోన్ డీసీపీ, మల్కాజ్‌గిరి డీసీపీ, టాస్క్‌ఫోర్స్, పలు కమిషనరేట్లలో క్రైమ్, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల పర్యవేక్షణకు అధికారుల నియామకానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రతిపాదనల్లో తమ పేర్లు లేకపోవడంతో కంగుతిన్న కొంతమంది అదనపు ఎస్పీలు.. మంత్రులు, ఎంపీల చుట్టూ తిరిగి డీజీపీ పంపిన ఫైలును హోం శాఖలోనే పక్కన పెట్టించారు. తమకు కావాల్సిన పోస్టును ఇతరులకు కేటాయించడమేంటని లాబీ చేసి.. విషయం తెర మీదకు తీసుకురాకుండా హెచ్చరికలు జారీ చేయించారు. దీంతో డీజీపీ కార్యాలయ వర్గాలు షాక్ తిన్నట్టు తెలుస్తోంది.
ఇది రెండో సారి: అదనపు ఎస్పీల బదిలీ ప్రతిపాదనలకు రెండు రోజుల ముం దు అదనపు కమాండెంట్లకు కమాండెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ పంపిన ప్రతిపాదనలను హోంశాఖలో పక్కన పెట్టించారు. ఫైలు ఎందుకు ఆగిందని ఆరా తీయగా.. ఒక కమాండెంట్‌కు హైదరాబాద్‌లోని బెటాలియన్‌లో పోస్టింగ్ ఇవ్వకుండా సత్తుపల్లిలోని బెటాలియన్‌కు బదిలీ ప్రతిపాదనలు పంపారు. దీంతో ఈ అధికారి తన లాబీయింగ్‌తో హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకుండా ఆపేసి, నాలుగు రోజుల తర్వాత హైదరాబాద్‌లోని ఓ బెటాలియన్‌కు కమాండెంట్‌గా పోస్టింగ్ మార్పించుకొని ఆదేశాలు వెలువడేలా ఒత్తిడి చేశారు.
ఇదేం పద్ధతి?: ఈ రెండు వ్యవహారాలపై ఐపీఎస్ అధికారుల్లో అసహనం వ్యక్తమవుతోంది. అర్హత, అంకితభావాన్ని బట్టి సంబంధిత అధికారులకు ఉన్న తాధికారులు పోస్టింగ్స్ ప్రతిపాదనలు పంపిస్తే, పైరవీలు చేసి తమను అవమానించేలా చేస్తున్నారని పలువురు ఐపీఎస్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే తమకు విలువ ఏముంటుందని ఆందోళన చెందుతున్నారు.
మాకే పోస్టింగ్స్ ఇవ్వరా?
Published Thu, Apr 6 2017 3:46 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM
Advertisement
Advertisement