రెండేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలు.. ఆర్భాటంగా చేసిన ఐదు సంతకాలు హుష్‌కాకి.. హామీలన్నీ గాలికి... వీటన్నిటికి తోడు విచ్చలవిడి అవినీతి..
* తెలుగుదేశంలో ‘గడపగడప’ కలవరం..
* చంద్రబాబు ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలు.. ఆర్భాటంగా చేసిన ఐదు సంతకాలు హుష్‌కాకి.. హామీలన్నీ గాలికి... వీటన్నిటికి తోడు విచ్చలవిడి అవినీతి.. ఇదే సమయంలో వీటన్నిటినీ ఎండగట్టేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ‘గడపగడపకు వైఎస్సార్’ నినాదంతో భారీ కార్యక్రమం చేపట్టడం అధికార తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. దాంతో ఏం చేయాలనే దానిపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో సమావేశమయ్యారు.
గుంటూరుజిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో గురువారంనాడు ఈ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమంపైనే ప్రధానంగా చర్చ జరిగిందని సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలపై వంద ప్రశ్నలను తాము ప్రజల్లోకి తీసుకెళతామని వైఎస్సార్‌సీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఆ ప్రశ్నల వివరాలు సేకరించి వాటికి సమాధానాలు ఇచ్చేలా నేతలు సిద్ధంగా కావాలని చంద్రబాబు సూచిం చారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయి నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ సంపూర్ణంగా అమలు చేయలేకపోయామనే విషయాన్ని సమావేశంలో పాల్గొన్న నేతలు ప్రస్తావించగా చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనైనట్లు సమాచారం. మీరే ఇలా అంటే కిందిస్థాయి నేతలు ప్రజలకు ఏం చెప్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఏం చెప్పాలో మీరే చెప్పండి...
ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతామన్న ఒక్క వాగ్దానాన్నే అమలుచేశామని... అదికూడా వెనువెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉండదనే కారణంతో అమలు చేశాం తప్ప అంతకంటే ఏం చేయలేదని నేతలు చెప్పినట్లు తెలిసింది. దీన్ని ఇంకా ప్రభుత్వ రంగ సంస్థల వారికి అమలు చేయలేదనే అంశాన్ని ప్రస్తావించిన నేతలు ప్రజలకు, వైఎస్సార్‌సీపీ నేతలకు ఏం సమాధానం చెప్పాలో మీరే చెప్పండని అడిగినట్లు తెలిసింది. రుణమాఫీ, ఎన్‌టీఆర్ సుజలస్రవంతి, డ్వాక్రా రుణాల మాఫీ వంటివి కూడా సమగ్రంగా అమలు చేయలేదని, ఇవి సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే చేసిన తొలి ఐదు సంతకాల్లో ఉన్నాయని నేతలు ప్రస్తావించారు. ఇటువంటి వాటి విషయంలో తాము ప్రజలకు ఏం చెప్పాలో తెలియటం లేదని కూడా వారు అన్నట్లు తెలిసింది.
అల్లరి చేసే యోచన...
టీడీపీ బలంగా ఉన్న గ్రామాల్లో వైఎస్సార్‌సీపీని ప్రవేశించనివ్వకుండా అడ్డుకుని గడపగడపకూ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేయాలని నేతలకు బాబు సూచించినట్లు తెలిసింది. దీని వల్ల ఘర్షణ వాతావరణం తలెత్తుతుందని, దాన్ని ఆసరాగా తీసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే పేరిట వైఎస్సార్ సీపీ నేతలను కట్టడి చేయవచ్చని అన్నట్లు సమాచారం. ముద్రగడ దీక్ష సమయంలో సాక్షి ఛానల్ ప్రసారాలను ఆపిన ట్లే వైఎస్సార్‌సీపీ కార్యక్రమం జరిగే సమయంలో ఏదో ఒక మిషతో ఆ ఛానల్ ప్రసారాలను నిలువరించాలని, పత్రికపై కూడా కేసులు నమోదు చేయటం ద్వారా అడ్డంకులు సృష్టించాలని నిర్ణయించినట్లు సమాచారం.
కాగా, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయంతో పాటు నేతలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు సీనియర్ మంత్రులు, నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు. గవర్నర్‌తో తాను జరిపిన చర్చల సారాంశాన్ని వివరించిన బాబు... నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించానని, దానిని సరైన సమయంలో వెల్లడిస్తానని, సరిగా పనిచేయని వారిపై చర్యలుంటాయన్నారు. ఆర్‌డీఓ, డీఎస్‌పీ స్థాయి అధికారుల బదిలీలను రష్యా పర్యటన తర్వాత చేపడతానని చెప్పారు. నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేస్తానని తెలిపారు.