
మార్పు కోసమే వన్ హైదరాబాద్
♦ స్వచ్ఛ, అవినీతి రహిత రాజకీయాలే లక్ష్యం
♦ నిర్దిష్ట ఎజెండాతోనే కూటమి ఏర్పాటు
♦ గ్రేటర్‌లోనూ డబ్బు రాజకీయమే...
♦ గూండాలు, కబ్జాదారులు పోటీలో ఉన్నారు.
♦ ఓటర్లు ఆలోచించి ఓటేయాలి
♦ లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ
‘మార్పు’ కోసం అంటూ రాజకీయ రంగప్రవేశం చేసిన జయప్రకాష్ నారాయణ జేపీగా అందరికీ సుపరిచితులు. 1996లో ఐఏఎస్‌కు రాజీనామా చేసిన ఆయన సుపరిపాలన కోసం లోక్‌సత్తా ఉద్యమం ప్రారంభించారు. 2006లో లోక్‌సత్తాను రాజకీయ పార్టీగా విస్తరించారు. ప్రస్తుతం ఆ పార్టీకి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గ్రేటర్ పరిధిలో అవినీతిని అంతం చేయాలని, ప్రజలకు మౌలిక వసతులు పూర్తిగా కల్పించాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. డబ్బు రాజకీయాలకు ఓటర్లు చెక్‌పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా, స్వచ్ఛ రాజకీయాల కోసమే మొదటిసారిగా వామపక్షాలతో కలిసి ‘వన్ హైదరాబాద్’ కూటమిని ఏర్పాటు చేశామంటున్న జేపీతో....
- సాక్షి, సిటీబ్యూరో
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వన్ హైదరాబాద్ కూటమి ఎన్ని స్థానాల్లో గెలవబోతోంది?
రాజకీయాలను మార్చటానికి ‘వన్ హైదరాబాద్ కూటమి’ని ఏర్పాటు చేశాం. నిర్ధిష్టమైన ఎజెండాతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఇక్కడ గెలుపోటముల అంచనాలకు వెళ్లదలుచుకోలేదు. గెలవాలన్న ఆశతో.. సంప్రదాయ పార్టీలు కోట్లు ఖర్చు పెట్టి పోటీలో నిలుస్తున్నాయి. కానీ మేము అలా కాదు. నిజమైన ప్రత్యామ్నాయ విధానాలతో, ఎజెండాతో ప్రతి బస్తీలో జనాభాకు తగ్గట్టుగా అధికారాలు ప్రజల చేతిలో ఉండాలని కోరుకుంటున్నాం. స్థానికంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం.
ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఎలా సాగింది. కొన్ని పార్టీల్లో కొందరు నాయకులు సీట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై మీరేమంటారు?
రాజకీయం అంటే అధికారం అనుకుంటున్నారు. అధికారం అంటే...దోచుకోవటం, పైరవీలు చేసుకోవటంగా మారింది. ఎన్నికలు ఓటు వేసే వారి గురించి కాదు, పోటీ చేసే వారి కోసమనేలా మారింది వ్యవస్థ. ఎన్నికలు జాక్‌పాట్‌గా, వ్యాపారంగా మారాయి. అందుకే ...కార్పొరేటర్ అభ్యర్థి రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ డబ్బు రాజకీయాలను ప్రజలే అంతం చేయాలి.
వామపక్షాలతో కలిసి కూటమిగా లోక్‌సత్తా పోటీ చేయటానికి కారణమేమిటి? ఈ పార్టీల మధ్య భావ సారూప్యత ఉందంటారా?
ఇది నిజమైన, నిజాయితీ కలిగిన కూటమి. అధికారం ప్రజల చేతిలో ఉండాలని వామపక్షాలు కోరుకుంటున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా, స్వచ్ఛ రాజకీయాలను ఆహ్వానిస్తున్నాయి. అభిప్రాయభేదాలు ఏ మాత్రం లేవు. అందువల్లనే సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐతో కలిసి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎజెండా లేదు. నిర్ధిష్టమైన ఎజెండా, జనం సమస్యలపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లుతున్నది మా కూటమే. నగర ప్రజలు గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఎన్నికల్లో పార్టీల ఎన్నికల ప్రచార సరళి, అభ్యర్థుల ఎంపిక ఎలా ఉందనుకుంటున్నారు?
ఎన్నికల్లో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఒక్కో డివిజన్‌లో రూ. 8 కోట్ల చొప్పున జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.1200 కోట్లు ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. పైగా టికెట్లు కూడా గూండాలు, భూ కబ్జాదారులకు ఇచ్చారు. అలాంటి వారు ప్రజలకు మంచి పనులు ఏమి చేస్తారు? గెలిచిన తర్వాత దోచుకోవటమే పరమాధిగా పైరవీలు చేసుకుంటారు. వన్ హైదరాబాద్ కూటమి దీనికి పూర్తి భిన్నంగా అవినీతికి వ్యతిరేకంగా, స్వచ్ఛ రాజకీయాల కోసం పని చేస్తుంది. ప్రజలకు కనీస సౌకర్యాల కల్పించేందుకు కృషి చేస్తుంది. మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పార్కులు...ఒక్కటేమిటి 90 శాతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతుంది. సామాన్యుడి చేతిలో అధికారముండాలి. పన్నుకట్టే వాడే ప్రభువు కావాలని కోరుకుంటున్నాం.
మీ హయాంలో హైదరాబాద్‌కు ఏం చేశారు. ఇంకా ఎం చేయబోతున్నారు?
హైదరాబాద్ నగరానికి కృష్ణా మూడవ దశ ద్వారా మంచినీరు రావటానికి కృషి చేశాను. దీనిపై అసెంబ్లీలో పోరాడి సాధించాను. కూకట్‌పల్లికి 8 ఎంజీడీల మంచి నీరు మాత్రమే సరఫరా అయ్యేది. ఈ నీటి సరఫరాను రెట్టింపు చేశాను. కూకట్‌పల్లి నియోజకవర్గంలో రూ.2400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. పైప్‌లైన్ల కోసమే రూ. 700 కోట్లు ఖర్చు చేశాం. మెట్రో రైలు రాక సందర్భంగా అదనంగా ఏడు రహదారులకు ప్రణాళిక రూపొందించి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపించగలిగాను. ప్రతి పాఠశాలలో మాత్రశాలలు, మరుగుదొడ్లు, అదనపు గదులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అర్బన్ హెల్త్ సెంటర్లకు భవనాలతో పాటు, ప్రసూతి వసతులు కల్పించాలని కోరాం. నగరాభివృద్ధికి మేం ప్రత్యేకంగా దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాం.
రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ పాలన ఎలా ఉంది? మీరెన్ని మార్కులు వేస్తారు?
ఇద్దరూ అధికార కేంద్రీకరణ చేస్తున్నారు. ఇద్దరికీ మార్కులు ఏమి వేయను. కానీ పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. మోదీ ఆర్థిక వ్యవస్థ గట్టిపడేందుకు ప్రయత్నిస్తున్నారు. అవినీతి లేకుండా పారదర్శకంగా పనిచేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మంచి నినాదం. ఇది ఊరు,వాడ,పట్టణం, నగర స్థాయికి చేర్చాలి. నల్లగొండలో ఒక అమ్మాయి మరుగుదొడ్డి లేదని ఆత్మహత్య చేసుకోవటం తీవ్రంగా బాధించింది. కేసీఆర్ పూర్తిగా అధికార కేంద్రీకరణతో పనిచేస్తున్నారు. మంత్రులు, అధికారుల భాగస్వామ్యం ఏమీ ఉండడం లేదు. పనులు జనం దగ్గరికి వెళ్లటం లేదు. ప్రజల భాగస్వామ్యం గురించి మాట్లాడే పరిస్థితి కనిపించటం లేదు. ఈ పద్ధతి మారితే మంచిదని నా అభిప్రాయం.
మెరుగైన సమాజం కోసం...ఓటేద్దాం
‘గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్లంతా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. కుల, మత, వర్గ విభేదాలు మరిచిపోయి మంచితనం, నిజాయితీ కలిగిన అభ్యర్థులకే ఓటు వేయాలి..’ అని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం కమిషనర్ కార్యాలయంలో సొసైటీ ఫర్ స్మాల్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్యం కోసం రూపొందించిన కరపత్రాలు, డోర్ స్టిక్లర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గతంలోకంటే ఈసారి ఓటింగ్ శాతం తప్పనిసరిగా పెరగాలన్నారు. మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఓటేయాలన్నారు. మచ్చలేని వ్యక్తులకే ఓటేయాలని లేకుంటే..ఐదేళ్లు నష్టపోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు వినేష్‌రాజ్, ప్రధానకార్యదర్శి నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
- కవాడిగూడ