=మృత్యు మార్గంగా ఔటర్ రింగ్‌రోడ్డు
=తుక్కుగూడ వద్ద ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
=మృతులంతా మహారాష్ట్ర వాసులు
=ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఘటన
=పొగమంచే ప్రమాదానికి కారణమని అనుమానం
=సూచిక బోర్డులు లేకపోవడమే కారణం!
=నియంత్రణ లోపం.. పర్యవేక్షణ కరువు
=ఈ ఏడాది ఇప్పటికి 65 మంది బలి
సాక్షి, సిటీబ్యూరో: రహదారులు నెత్తురోడుతున్నాయి. ప్రత్యేకించి ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాణాలు తోడేస్తోంది. ఈ రోడ్డెక్కితే బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిన దుస్థితి. ప్రాణాలకు భద్రత, భరోసా లేకుండాపోతోంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా రెప్పపాటులో మృత్యువాత పడే పరిస్థితి నెలకొంది. రోజుకో ప్రమాదంతో ఔటర్ రక్తసిక్తమవుతోంది. శుక్రవారం ఉదయం తుక్కుగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రయాణికుల్లో భయాన్ని రెట్టింపు చేసింది. మహారాష్ట్ర భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు ఘట నా స్థలంలోనే మృత్యుఒడికి చేరుకోగా, నలుగురు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు.
ఉసురుతీస్తున్న ఉదాసీనత
ప్రభుత్వ విభాగాల ఉదాసీనత ప్రమాదాల రూపంలో ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్‌ఆర్)ను నిత్యం రక్తసిక్తం చేస్తున్నాయి. పలువురు ప్రముఖులతో సహా అనేక మందికి గుండెకోతను మిగుల్చుతున్నాయి. ఈ మార్గం నిర్వహణ సక్రమంగా లేకపోవడం, నెలలు గడుస్తున్నా భద్రత చర్యల అంశం కొలిక్కిరాకపోవడంతో ఓఆర్‌ఆర్‌పై నిషేధిత వాహనాలు, సర్వీస్ రోడ్లపై జంతువులు రాజ్యమేలుతూ ప్రాణాలు హరిస్తున్నాయి. ఇక, కుర్రకారు క్రేజీగా ఓఆర్‌ఆర్‌కు వెళ్తూ మృత్యువును కౌగిలించుకుంటున్నారు. ప్రస్తుతానికి సిద్ధమైన ఓఆర్‌ఆర్ మార్గంలో 12 కూడళ్లు మృత్యు కేంద్రాలుగా మారాయి.
ప్రస్తుతం పటాన్‌చెరు నుంచి శంషాబాద్ మీదుగా పెద్ద అంబర్‌పేట వరకు 85.5 కిమీ మేర ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయింది. దీంతో ఈ మార్గంలో హెచ్‌ఎండీఏ దశల వారీగా వాహనాల రాకపోకల్ని అనుమతించింది. ఇంకా కొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్నా ఆ విషయాన్ని తెలిపే సూచికలు లేవు. అడ్డదిడ్డంగా అక్రమ పార్కింగ్స్ నిర్వహిస్తున్నా పట్టించునే వారే కరవయ్యారు. గత మూడేళ్లలో ఔటర్‌పై 137 ప్రమాదాలు జరగగా, 173 మంది దుర్మరణం పాలయ్యారు. ఒక్క ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు 65 మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
పొగమంచే ప్రాణాలు తీసిందా?
మహారాష్ట్రకు చెందిన తొమ్మిది మందితో కూడిన బృందం గురువారం బాంద్రా జిల్లా తిరోడా తాలుకా భూత్‌నాథ్ నుంచి తిరుపతికి బయల్దేరింది. శుక్రవారం తెల్లవారుజామున వీరు ఔటర్‌పైకి చేరుకున్నారు. ముంబై జాతీయ రహదారిలో వచ్చిన వీరు పటాన్‌చెరు వద్ద ఔటర్ రింగురోడ్డు ఎక్కారు. శంషాబాద్‌లో ఔటర్ దిగి బెంగళూరు హైవే మీదుగా వెళ్లాలి. కానీ పొరపాటున ఔటర్‌రింగ్ రోడ్డు మీదుగా అలాగే ముందుకు దాదాపు 15 కిలోమీటర్లు వచ్చేశారు. తుక్కుగూడ దగ్గర ఔటర్ దిగే వీలున్నా గమనించలేకపోయారు.
ఈ క్రమంలోనే వేగంగా వెళ్తున్న వీరి వాహనం తుక్కుగూడ - రావిర్యాల మధ్యలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో వాహనం ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. శంషాబాద్, పహడీషరీఫ్ పోలీసులు, తుక్కుగూడ, రావిర్యాల గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి పొగమంచే కారణమని పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పొగమంచు దట్టంగా అలుముకుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. రోడ్డుపై ఎక్కడా సరైన సూచిక బోర్డులు లేవు. దీంతోనే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ఎక్కాల్సిన, దిగాల్సిన చోట బోర్డులు లేక వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు.
ప్రాణాపాయస్థితిలో క్షతగాత్రులు
ప్రమాదంలో గాయపడిన నలుగురు క్షతగాత్రులను 108 వాహనంలో ఎల్‌బీనగర్ యశోదరానగర్‌లోని మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో తలకు తీవ్ర గాయమైన యుగంధర్‌ను అపోలోకు తీసుకెళ్లారు. ప్రభాబాయి తుంటి, చాతి, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలి పారు. సుఖ్‌దేవ్‌కు పక్కటెముకలు విరిగాయి. ఊపిరితిత్తుల్లో గాయాలు కావడంతో శ్వాస కష్టంగా తీసుకుంటున్నాడు. డ్రైవర్ మనోజ్ తలకు, కుడిచేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద బాధితులు షాక్‌కు గురయ్యారని ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. చలి తీవ్రంగా ఉండడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, ఐసీయూలో ఉంచి వెంటిలెటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
ఔటర్‌పై మృత్యుఘోష
Published Sat, Dec 28 2013 5:15 AM | Last Updated on Mon, Oct 8 2018 6:05 PM
Advertisement
Advertisement