
గెలుపే లక్ష్యం!
పాతబస్తీలో రిజర్వేషన్లపై తర్జనభర్జన
ఎన్నికల్లో విజయానికి కసరత్తు
శివారుపై మజ్లిస్ దృష్టి భారీగా దరఖాస్తులు
సిటీబ్యూరో: పాతబస్తీలో అధిక శాతం డివిజన్లు రిజర్వ్ కావడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ విషయమై మజ్లిస్ పార్టీ తర్జనభర్జన పడుతోంది. జాతీయ స్థాయి విస్తరణకు పరుగులు తీస్తున్న తరుణంలో సొంత గడ్డ ‘బల్దియా’ ఎన్నికలు ఆ పార్టీకి సవాలుగా మారాయి. టీఆర్‌ఎస్ వ్యూహంతో మజ్లిస్ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 44 డివిజన్లలో 36 స్థానాలు రిజర్వుడు కేటగిరిలోకి మారాయి. కేవలం 8 డివిజన్లు మాత్రమే జనరల్‌కు మిగిలాయి. అయినప్పటికీ తమకు గట్టి పట్టున్న పాతబస్తీలో ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో రెండు మూడు రోజులుగా అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కీలక నేతలైన అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రీ,హసన్ జాఫ్రీ, పార్టీ ఎమ్మెల్యేలు తదితరులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తున్నారు. డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు వెనుకనున్న టీఆర్‌ఎస్ వ్యూహాన్ని తిప్పి కొట్టి... వాటిని చేజారకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని యోచిస్తున్నారు.
శివారుపై ఆశలు
పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాలలోని డివిజన్లపై మజ్లిస్ పార్టీ దృష్టి సారించింది. సీట్ల కేటాయింపులో దళితులు, బీసీలకు పెద్ద పీట వేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘షహర్ హమారా.. మేయర్ హమరా’ అనే నినాదంతో ప్రచారానికి దిగుతోంది. దీంతో ముస్లిమేతరులు సైతం పార్టీ తరఫున పోటీకి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేస్తున్నారు. ఇటీవల దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.శివారు డివిజన్లలోనూ ముస్లింల ప్రాబల్యం ఉండటంతో దరఖాస్తులు భారీగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గెలుపు గుర్రాలతో పాటు వారి ఆర్థిక వనరుల పరిస్థితిని తెలుసుకునేందుకు సర్వే చేసినట్టు సమాచారం.
ప్రధాన సీట్లపై కన్ను
నగరంలోని ప్రధాన డివిజన్లలోనూ పాగా వేయాలని మజ్లిస్ నిర్ణయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన జూబ్లీహిల్స్, ముషీరాబాద్‌తో పాటు ఖైరతాబాద్, సనత్‌నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో బలమైన బీసీ, దళిత అభ్యర్థులను రంగంలో దింపేందుకు అధిష్ఠానం సిద్ధమవుతోంది. అవసరమైతే రాజకీయ పరిణామాలను బట్టి కలిసి వచ్చే పక్షాలతో కొన్ని డివిజన్లలో స్నేహపూర్వక పోటీకి దిగాలని అగ్రనేతలు భావిస్తున్నారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన డివిజన్లను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేజారకుండా చూడాలని వ్యూహ రచన చేస్తున్నారు.