ఉన్న ‘ఆసరా’ తీసేస్తారా?
పింఛన్ల కోసం ఆందోళనలు
ఇందూరులో సీఎం దిష్టిబొమ్మ దహనం
హుస్నాబాద్‌లో చెప్పులు చూపించిన వృద్ధులు
హుస్నాబాద్/మాక్లూర్/జోగిపేట: వృద్ధాప్యంలో నిన్నటి వరకు ఆసరాగా ఉంటుందనుకున్న పథకం వస్తుందో.. రాదోనన్న భయం వృద్ధులను వెంటాడుతోంది. కొత్త నిబంధనలు... ఇంకా పూర్తిస్థాయిలో జాబితాలు సిద్ధం కాకపోవడంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆందోళన బాట పట్టి, పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పింఛన్లు రద్దు అయ్యాయని పలు గ్రామాల్లో సోమవారం వృద్ధులు ఆందోళనకు దిగారు. కరీంనగర్, మెదక్ జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి.
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో గతంలో 1,735 మంది పింఛన్ దారులున్నారు. కొత్తగా 2,810 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వీరిలో కేవలం 849 మందినే అర్హులుగా గుర్తించారు. దీంతో ఆగ్రహించిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు నగర పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ పింఛన్లు ఎందుకు తొలగించారో చెప్పాలంటూ రహదారిపై బైఠాయించారు. సీఎం కేసీఆర్, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్ నాయకులు మరోసారి ఓట్ల కోసం వస్తే చెప్పులతో కొడతామంటూ చెప్పులు చూపించారు.
రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు. వివిధ పార్టీల నాయకులు వీరికి మద్దతు తెలిపారు. రాత్రి ఎనిమిది గంటల వరకు ఆందోళన కొనసాగుతూనే ఉంది. జిల్లాలో పలు చోట్ల సైతం పింఛన్ల కోసం ఆందోళనలు జరిగాయి. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడి, డీకంపల్లి, అడవి మామిడిపల్లి గ్రామాలకు చెందిన వారు పింఛన్లు రద్దు అయ్యాయని తహశీల్ కార్యాలయాన్ని ముట్టడించారు. మాక్లూర్, మాదాపూర్ రహదారి, అడవిమామిడిపల్లి వద్ద రహదారిపై రాస్తారోకో చేశారు. వేల్పూర్ తహశీల్ కార్యాలయాన్ని ముట్టడించారు. మెదక్ జిల్లా ఆందోలులో జాతీయ రహదారిపై బైఠాయించారు.
‘ఆసరా’ దొరకదేమోనని నలుగురు మృతి
సోమవారం ముగ్గురు పింఛన్‌పై బెంగతో నలుగురు తనువు చాలించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన హరిజన్ చిన్నదేవన్న(72), కుర్మక్క(68) దంపతలుకు ఆరుగురు సంతానం కాగా, ఇందులో పెద్ద కొడుకు కృపానందం వికలాంగుడు. ఇటీవల ప్రకటించిన జాబితాలో ఈ ముగ్గురి పేర్లు లేవు. దీంతో చిన్నదేవన్న సోమవారం గుండెపోటుతో చిన్నదేవన్న మరణించాడు. ఈ వార్త విన్న కుర్మక్క కూడా కుప్పకూలి ప్రాణాలు విడించింది. వరంగల్ జిల్లా కొడకండ్ల శివారు గుమ్ములబండ తండాకు చెందిన లాల్‌సింగ్, మెదక్ జిల్లా బొప్పాపూర్‌కు చెందిన దుంపలపల్లి రాజయ్య(75) గుండెపోటుకు గురై మృతి చెందారు.