విత్తనాలను నల్ల బజారుకు తరలిస్తే అరెస్టులే
‘సాక్షి’ కథనంపై స్పందించిన మంత్రి పోచారం
సాక్షి, హైదరాబాద్: శనగ విత్తనాలను ఎవరైనా నల్ల బజారుకు తరలిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో విత్తనాలను పక్కదారి పట్టించిన ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశామని వెల్లడించారు. ‘సాక్షి’లో శుక్రవారం ‘సబ్సిడీ శనగకు.. అవినీతి చీడ’ శీర్షికతో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన ఆయన ఎక్కడైనా, ఎవరైనా విత్తనాలను నల్ల బజారుకు తరలిస్తే ఊరుకోబోమని అన్నారు.
విత్తనాలకు కొరత లేదని స్పష్టం చేశారు. తాజా లెక్కల ప్రకారం 77,703 క్వింటాళ్ల శనగ విత్తనాలను జిల్లాలకు పంపిణీ చేశామని తెలిపారు. అందులో 57 వేల క్వింటాళ్లు రైతులకు సరఫరా చేశామని, ఇంకా 20 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో శనగ విత్తనాల సరఫరాకు సంబంధించి ‘సాక్షి’ కథనం నేపథ్యంలో ఆ జిల్లా వ్యవసాయాధికారి నుంచి నివేదిక కోరినట్లు ఆ శాఖ కమిషనర్ జగన్‌మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.