
'సినిమా డైలాగులు ఎక్కువ కాలం సాగవు'
పవన్ కల్యాణ్ జనసేన వెనుక రహస్య ఎజెండా దాగి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ : సినీనటుడు పవన్ కల్యాణ్పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్ జనసేన వెనుక రహస్య ఎజెండా దాగి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ను టార్గెట్ చేయడంలో కుట్ర కోణం ఉందని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ తన స్థాయికి మించి మాట్లాడారని పొంగులేటి ధ్వజమెత్తారు. సినిమా డైలాగులు ఎక్కువ కాలం సాగవని ఆయన ఎద్దేవా చేశారు. వందమంది పవన్ కల్యాణ్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరని పొంగులేటి అన్నారు.
పవన్ కల్యాణ్ నిన్న జనసేన ఆవిర్భావ సభలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టారు. ‘కాంగ్రెస్ హటావో.. దేశ్ బచావో’ అంటూ తన ఎజెండాను వేదిక నుంచి నినదించారు. కాంగ్రెస్‌తో తప్ప ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధమని స్పష్టం చేసిన విషయం విదితమే.