
పార్టీ పదవులకు పొంగులేటి సుధాకర్ రెడ్డి రాజీనామా
హైదరాబాద్ : ఏఐసీసీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి బుధవారం పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పీసీసీ కార్యవర్గ, సమన్వయ కమిటీ సభ్యత్వ పదవులకు ఆయన రాజీనామా చేసి, ఆ లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీకి ఫ్యాక్స్ ద్వారా పంపారు. పీసీసీ పదవుల పంపకం సరిగా లేదనే అసంతృప్తితో పొంగులేటి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
పదవుల భర్తీలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని పొంగులేటి ఆరోపించారు. పీసీసీ పదవుల భర్తీలో మల్లు భట్టి విక్రమార్కను, రేణుకా చౌదరిని మాత్రమే సంప్రదించారని, ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తొందరపడవద్దని షబ్బీర్ అలీ ఈ సందర్భంగా పొంగులేటిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. మరోవైపు పొంగులేటి పదవులకు రాజీనామా చేయటం పార్టీలో కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.