
మట్టిలో మాణిక్యాలు
పేదరికం వెంట వచ్చినా.. ఆర్థిక కష్టాలు వెంటాడినా.. చదువులో మాత్రం వారు మెరిశారు. వారి కష్టానికి మార్కుల రూపంలో ప్రతిఫలం అందుకున్నారు. మట్టిలో మెరిసిన ఈ మాణిక్యాలు ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారు హైదరాబాద్ విద్యార్థులు
కన్నవారి కష్టానికి మార్కుల కానుక..
హిమాయత్‌నగర్: తండ్రి చిన్న కంపెనీలో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తల్లి ఇంటి పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. చదువు విలువ తెలిసినవారు కూతురిని చదివిస్తున్నారు. అందుకు తగ్గట్టే ఆ బాలిక చదువులో రాణించి ఉత్తమ మార్కులు సాధించి కన్నవారికి కానుకగా ఇచ్చింది. ఈసీఐఎల్‌కు చెందిన షేక్ ఖజామియా మాదాపూర్‌లో ఓ పరిశ్రమలో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. వస్తున్న తక్కువ వేతనంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని కుమార్తె షేక్ మస్తానీ హిమాయత్‌నగర్ న్యూ చైతన్య కళాశాలలో ఇంటర్‌లో చేరింది. జూనియర్ ఇంటర్‌లో 420/440 మార్కులు సాధించి శెభాష్ అనిపించుకుంది. డాక్టర్ కావాలనే ఆకాంక్షతో బైపీసీ గ్రూప్‌లో చేరినట్టు తెలిపింది.
చాయ్ అమ్ముతూ చదువు..
హిమాయత్‌నగర్: ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాలలో చదువుకునే విద్యార్థి తరగతులు పూర్తవగానే సాయంత్రం తన తండ్రికి సాయంగా చాయ్‌బడ్డీలో పనిచేస్తాడు. అయితేనేం.. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. హిమాయత్‌నగర్‌లోని న్యూ చైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న అభిషేక్ 477/500 మార్కులు సాధించాడు. ఇతడి తండ్రి సుల్తాన్‌బజార్‌లో చిన్న చాయ్‌బడ్డీ నడుపుతున్నాడు. తండ్రి పడే కష్టాన్ని చూడలేని అభిషేక్ కళాశాల అవ్వగానే నాన్నకు సాయంగా దుకాణంలో పనిచేస్తాడు. తన బిడ్డ చదువులో రాణించడంతో కన్నవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వికసించిన విద్యా కుసుమం..
జీడిమెట్ల: అటో డ్రైవర్ కుమార్తె సీనియర్ ఇంటర్ ఎంపీసీలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. తండ్రి పడే కష్టానికి తగిన ఫలితం సాధించాలని కష్టపడి ఈ ఘనతను సొంతం చేసుకుంది. అపురూప కాలనీకి చెందిన అటో డ్రైవర్ శ్రీహరిరాజు కుమార్తె బి.ఎన్.వి. సౌజన్య ఇంటర్ ఎస్‌ఆర్ నగర్‌లోని నారాయణ కళాశాలలో చదివింది. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఎంపీసీలో 988/1000 మార్కులు సాధించింది. పదో తరగతిలో సైతం 10/10 పాయింట్లు సాధించి శభాష్ అనిపించుకుంది. భవిష్యత్తులో ఇంజినీర్ కావాలన్నదే తన ధ్యేయమని సౌజన్య తెలిపింది.