- జూన్ రెండోతేదీ నాటికి దరఖాస్తు చేసుకోవాలి
- బాలికలకు నూజివీడు, బాలురకు తిరువూరులో కౌన్సెలింగ్
నూజివీడు, న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రాంతాల ఎస్సీ వర్గాలకు చెందిన ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని ఎంతగానో ఆరాటపడతారు. అలాంటి వారి కోసం జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖకు చెందిన గురుకుల కళాశాలు ఉన్నాయి. వీటిల్లో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో చేర్చుకునేందుకు అధికారులు నోటిఫికేషన్‌ను జారీచేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఇంటర్‌లో చేరేందుకు జూన్ రెండో తేదీ సాయంత్రం ఐదుగంటల కల్లా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న బాలబాలికలకు జూన్ ఆరోతేదీన కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
జిల్లాలో పది కళాశాలలు
సాంఘిక సంక్షేమశాఖకు చెందిన గురుకుల పాఠశాలలు జిల్లాలో పది ఉన్నాయి. వీటిల్లో బాలికలకు నూజివీడు, నందిగామ, చల్లపల్లి, గన్నవరం మండలం వీరపనేనిగూడెం, గుడివాడ, జగ్గయ్యపేట, పెడన మండలం బల్లిపర్రులో ఉన్నాయి. బాలురకు తిరువూరు, మచిలీపట్నం మండలం రుద్రవరం, ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో ఉన్నాయి.
సీట్ల వివరాలు
బాలుర కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూపులో 40 సీట్లు చొప్పున ఉన్నాయి. బాలికలకు సంబంధించి ఎంపీసీ, బైపీసీ గ్రూపులు నూజివీడు, నందిగామ, చల్లపల్లి, వీరపనేనిగూడెం, గుడివాడలో ఉన్నాయి. జగ్గయ్యపేట, బల్లిపర్రులోని కళాశాలల్లో ఆర్ట్స్ గ్రూపులైన ఎంఈసీ, సీఈసీ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూపులో 40 సీట్లు ఉన్నాయి. ఈ కళాశాలల్లో కేవలం ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధన జరుగుతుంది.
ఇవీ అర్హతలు
పదో తరగతి ఒక ప్రయత్నంలో మార్చి-2014లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్థుల వయో పరిమితి ఆగస్టు 31నాటికి 17 సంవత్సరాలు దాటకూడదు. సాంఘిక సంక్షేమశాఖ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకైతే ఒక ఏడాది సడలింపు ఉంటుంది. పదో తరగతి తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు. మీ-సేవ నుంచి పొందిన పదో తరగతి గ్రేడ్ జాబితా, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జిరాక్సు కాపీలను దరఖాస్తుతో జతచేయాలి. ఆదాయం లక్ష రూపాయల లోపు ఉండాలి. దరఖాస్తును జూన్ రెండో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అందజేయాలి. ఆ తరువాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించరు.
కౌన్సెలింగ్ జరిగే ప్రదేశాలు
జూన్ ఆరో తేదీన బాలికలకు నూజివీడు పట్టణ పరిధిలోని తిరువూరు రోడ్డులో ఎమ్మార్ అప్పారావు కాలనీ వద్ద ఉన్న గురుకుల పాఠశాలలో ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహిస్తారు. బాలురకు తిరువూరులోని గురుకుల కళాశాలలో నిర్వహిస్తారు. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు గంట ముందుగా హాజరవ్వాలి.