
ఎస్సీ వర్గీకరణకు పాలకులే అడ్డు!
- ఉస్మానియాలో జరిగిన మేధావుల సభలో ప్రకాశ్ అంబేడ్కర్
- రాజ్యాంగ ప్రకారం రిజర్వేషన్ల వర్గీకరణ ఆమోదయోగ్యమే
- దళితులు రాజకీయ శక్తిగా ఎదగాలి
- లేకుంటే మనువాద భావజాల ఆధిపత్యం వస్తుందని వ్యాఖ్య
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాజ్యాంగ ప్రకారం ఆమోదయోగ్యమేనని, కానీ పాలకులే దానికి అడ్డు అని డా. బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. దళితులు రాజకీయ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో మాదిగ మేధావుల వేదిక (ఎంఎంవీ) ఆధ్వర్యంలో మేధావుల సంఘీ భావ మహాసభ జరిగింది. కార్యక్రమానికి ఓయూ అధ్యాపకుడు డాక్టర్ కాశీం అధ్యక్షత వహించగా.. జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటాలకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాశ్ అంబేడ్కర్ ప్రసంగించారు. రాజ్యాంగపరంగా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలకు విస్తరించిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలే అడ్డంకి అని... అధికారంలో లేనప్పుడు మద్దతు తెలిపి, అధికారంలోకి వచ్చాక అడ్డు పడుతున్నాయని మండిపడ్డారు.
సమస్యల్ని పట్టించుకునే దిక్కు లేదు
ప్రజాసమస్యలను బలంగా వినిపించేందుకు దేశంలో గట్టి ప్రతిపక్షం లేకుండ పోయిందని.. ప్రస్తుతం ప్రతిపక్షాల పాత్ర నామమాత్రమేనని ప్రకాశ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. 2019 ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు మనుగడ సాధించలేని పరిస్థితి కనిపిస్తోందని.. పార్లమెంట్‌లో బీజేపీకి పూర్తి మెజార్టీ లభిస్తే రాజ్యాంగాన్ని తిరగరాసే ప్రమాదముందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రిజర్వేషన్లు రద్దు చేసి మనువాద భావజాల సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అందువల్ల దళిత బహుజనులు రాజకీయ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు.
వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అన్ని పార్టీల మద్దతు ఉందని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును పెట్టి ఆమోదింప జేయాలని మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. వర్గీకరణ కోసం వేసిన అన్ని కమిషన్లు దానికి అనుకూలంగానే నివేదికలను సమర్పిం చాయని చెప్పారు. న్యాయబద్ధమైన ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌కు చట్టబద్ధత కల్పించాలని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. బీసీలలో ఏబీసీడీ వర్గీకరణ ఉన్నట్లు ఎస్సీలలో వర్గీకరణ ఉంటే తప్పేమీ లేదని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. మాదిగల పోరాటానికి మాలలు కూడ అండ గా ఉండాలని ఉసా పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వివిధ పత్రికల సంపాదకులు శ్రీనివాసరెడ్డి, వీరయ్య, కె.శ్రీనివాస్, ప్రొ.నాగేశ్వర్, విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రభుత్వ మాజీ సీఎస్ కాకి మాధవరావు, విమలక్క, గద్దర్, గోరటి వెంకన్న, ప్రొ.ముత్తయ్య, రచయిత నందిని సిధారెడ్డి, కవి దేశపతి శ్రీనివాస్, ఐఏఎస్ అధి కారి విద్యాసాగర్, డాక్టర్ కాలువ మల్లయ్య, సూరేపల్లి సుజాత, ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి మాదిగ, డాక్టర్ వరంగల్ రవి, మాదిగ అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.