ఎన్నికలకు ముందు జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ
సాక్షి. హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠంపై అధికార టీఆర్‌ఎస్ పార్టీ కన్నేసింది. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవిని కైవసం చేసుకునే దిశగా చివరి క్షణంలో పావులు కదిపింది. ఇందు కోసం ఏకంగా జీహెచ్‌ఎంసీ చట్టాన్నే సవరించింది. అడ్డుగా మారిన ఓ నిబంధనను చట్టం నుంచి తొలగించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్-5(1ఏ) ప్రకారం ..ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేసే తేదీ నాటికి/ ఎమ్మెల్సీగా గవర్నర్ ద్వారా నామినేట్ అయిన తేదీ నాటికి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటరుగా నమోదైన ఎమ్మెల్సీలు మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యుడి హోదాలో నగర మేయర్ ఎన్నికల్లో ఓటేసే హక్కును కలిగి ఉన్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ చట్టం నుంచి ఈ నిబంధనను తొలగించింది.
ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరిస్తూ బుధవారం రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తమ ఓటును మార్పించుకున్న వారూ మేయర్ ఎన్నికల్లో ఓటేయడానికి అడ్డు తొలగింది. జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ కోసం సైతం ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ల అమలుకు అనుసరించిన మార్గంలోనే వెళ్లింది. ఉమ్మడి రాష్ట్రంలోని పాత చట్టాల సవరణ కోసం రాష్ట్ర పునర్విభజన చట్టం కల్పిస్తున్న వెసులుబాటును ఇందుకు వినియోగించుకుంది.
చట్ట సభల ద్వారా చట్టాల సవరణకు బదులు పునర్విభజన చట్టంలోని నిబంధనలను వాడుకోవడాన్ని ప్రశ్నిస్తూ ఇప్పటికే కొందరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ తరుణంలో మళ్లీ ప్రభుత్వం మేయర్ ఎన్నికలకు సంబంధించి చట్ట సవరణ చేయడం గమనార్హం. ఈ సవరణ ప్రకారం గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి వారం రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకునే అందరినీ ఓటరు జాబితాలో చేర్చుతారు. అంటే.. ఇప్పటివరకు ఓటరు జాబితాలో పేరులేని ఎమ్మెల్సీలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి వారం ముందు వరకు దరఖాస్తుచేసుకుంటే ఓటర్లుగా నమోదు కావడంతో పాటు ఎక్స్‌అఫిషియో సభ్యులవుతారు.
ప్రస్తుతం 14 మంది..
జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 14 మంది ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉన్నారు. వీరితోపాటు 25 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు రాజ్యసభ సభ్యులు, మరో ఐదుగురు లోక్‌సభ సభ్యులు వెరసి మొత్తం 49 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉన్నారు. మేయర్ ఎన్నికల్లో వీరి ఓట్లు కూడా కీలకంగా మారడంతో,, జాబితాలో పేరు లేని ఎమ్మెల్సీలు, ఇప్పుడు నమోదుకు దరఖాస్తుచేసుకున్నా ఎక్స్‌అఫిషియో సభ్యులవుతారు.
నోటిఫికేషన్ జాప్యం?
అధికార పార్టీ మేయర్ సీటును కైవసం చేసుకునేందుకే ప్రస్తుతం ఈ జీవోను జారీ చేసినట్లు ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. అదే నిజమైతే ముందుగా అనుకున్నట్లు మరో వారంలోగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం లేదని అంటున్నారు.
ఎమ్మెల్సీలకు ‘ఎక్స్ అఫిషియో’
Published Thu, Dec 31 2015 5:01 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement