ఫిల్మ్ నగర్ ప్రమాదంపై సి కళ్యాణ్ స్పందన
హైదరాబాద్: ఫిల్మ్నగర్ కల్చరల్ క్లబ్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనపై నిర్మాత సి. కళ్యాణ్ స్పందించారు. అసలు కల్చరల్ క్లబ్లో నిర్మిస్తున్నది భవనం కాదని, అది కేవలం పోర్టికో అని ఆయన వెల్లడించారు. ప్రమాదానికి క్లబ్ సభ్యులంతా బాధ్యత వహిస్తారని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ప్రమాదస్థలిని జీహెచ్ఎంసీ క్లూస్ టీం పరిశీలించింది. నిర్మాణంలో ఉపయోగించిన కాంక్రీట్, ఇసుకను సేకరించింది.
బిల్డింగ్ కూలిన ప్రాంతాన్ని కేంద్రమంత్రి దత్తాత్రేయ పరిశీలించారు. కార్మిక శాఖ ద్వారా బాధితులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రమాదంపై ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలో విపత్తులు ఎదురైతే ఎదుర్కోవడానికి సరైన సిబ్బంది లేరని, ఈ విషయంపై గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాశామని ఆయన తెలిపారు. పేద కూలీలను ఆదుకోవాని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క కోరారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.