
ఔరా...ఔటర్!
హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ సొబగులద్దిన జవహర్‌లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు పరిస్థితి అయోమయంలో పడింది.
ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని పనులు
కోర్టు కేసుల సాకుతో పడకేసిన ప్రాజెక్టు
జాప్యంపై పట్టించుకోని సర్కారు
సిటీబ్యూరో: హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ సొబగులద్దిన జవహర్‌లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు పరిస్థితి అయోమయంలో పడింది. ఈ పనులు ప్రారంభ మై తొమ్మిదేళ్లవుతున్నా ఇంకా కొనసాగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు తుది గడువును ఏటా పొడిగిస్తుండడంతో ఔటర్ నిర్మాణాన్ని హెచ్‌ఎండీఏ పూర్తిగా గాలికి వదిలేసిందన్న అపకీర్తిని మూటగట్టుకొంది. గడువు ముగిసినా ఇంకా 22 కి.మీ. రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా మిగిలి ఉండటం హెచ్‌ఎండీఏ పనితీరుకు దర్పణం పడుతోంది.
అసలు ఇది ఎప్పటికి పూర్తవుతుందన్నది అంతుబట్టని విషయంగా మారింది. అయితే... ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు అధికారులు మాత్రం 2016 ఫిబ్రవరి నాటికి పెండింగ్‌లో ఉన్న మెయిన్ క్యారేజీని అందుబాటులోకితెస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2012 నవంబర్ నాటికి ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం 158 కి.మీ. నిర్మాణం పూర్తవ్వాలన్నది లక్ష్యం. 9 ఏళ్లు గడుస్తున్నా అధికారులు ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. 2006లో పనులు ప్రారంభించగా... ఇప్పటివరకు 146 కి .మీ. మాత్రమే పూర్తయింది. దీనిలో 136 కి.మీ. వినియోగంలోకి వచ్చింది.