మండలిలో ప్రశ్నోత్తరాలు | Q & A on the Council | Sakshi
Sakshi News home page

మండలిలో ప్రశ్నోత్తరాలు

Published Thu, Dec 22 2016 1:08 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

Q & A on the Council

- ఇసుక అక్రమాలకు అడ్డూఅదుపూ లేదు
- అక్రమార్కులకు కల్పతరువుగా మారింది: పొంగులేటి


సాక్షి, హైదరాబాద్‌: అక్రమార్కుల పాలిట ఇసుక కల్పతరువుగా మారిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పు కుంటూ యథేచ్చగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. బుధవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పొంగులేటి మాట్లాడుతూ, ‘ఖమ్మం జిల్లా మణుగూరు ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా అడ్డూఅదుపూ లేకుండా సాగు తోంది. గోదావరిలో తవ్వరాదని నిబంధన ఉన్నా ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. అక్కడ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసి ఈ రవాణాను అరికట్టాలి’ అని కోరారు.  టీఆర్‌ఎస్‌ సభ్యుడు భూపతిరెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, మంజీరా పరీవాహకంలో రాత్రిళ్లు అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు కాంగ్రెస్‌ సభ్యుడు దామోదర్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో ఇసుక అక్రమాలను అరికట్టాలన్నారు.

 5,958 కేసులు పెట్టాం: మంత్రి కేటీఆర్‌
 మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ ‘ఇసుక అక్రమాలపై ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. 2014–15లో 1,591 కేసులు పెట్టి రూ.3.45 కోట్ల జరిమానా విధించింది. 2015–16లో ఏకంగా 5,958 కేసులు నమోదు చేసి.. రూ.11.83 కోట్ల జరిమానా వసూలు చేశాం. ఈ చర్యల వల్ల ప్రభుత్వ ఆదాయం 2015–16లో రూ.321 కోట్లు ఉండగా, 16–17లో ప్రస్తుతం వరకు రూ.230 కోట్లు వచ్చింది. ఇసుక అక్రమాల నిరోధానికి రీచ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం’ అని తెలిపారు. డిండి ప్రాజెక్టులో 2 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుక లభ్యత ఉందని దాన్ని తీస్తామని వెల్లడించారు.

నగర పంచాయతీల్లో పోస్టుల భర్తీ
రాష్ట్రంలో ఐదు పెద్ద గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా స్థాయి పెంచామని, ఆయా మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్‌ తెలిపారు. భూపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 523 టౌన్‌ ప్లానింగ్, ఎస్టేట్‌ ఇంజీనర్ల పోస్టుల భర్తీకి ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. శానిటరీ, ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ల భర్తీతోపాటు ఇతర పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు.

60 కళాశాలల భవనాలకు నిధులు: కడియం
రాష్ట్రంలో ఇప్పటికే మంజూరైన 73 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకుగానూ 60 కళా శాలల భవన నిర్మాణాలకు రూ.2.25 కోట్ల చొప్పున ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. భూపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కడియం సమాధా నమిస్తూ,  ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న 3 వేల పైచిలుకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని కేబినెట్‌లో నిర్ణయం చేసినా కోర్టు ఉత్తర్వులతో ఆ ప్రక్రియ నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీలను ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని కడియం వెల్లడించారు.

‘టఫ్‌’ కార్యాలయాన్ని తెరిపించండి: షబ్బీర్‌  
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, కళారూపాల ద్వారా ఉద్యమాన్ని నడిపించిన విమలక్కకు చెందిన తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ (టఫ్‌), అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయాలను సీజ్‌ చేయడం సమంజసం కాదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. తక్షణమే వారి కార్యాలయాలను, ఇళ్లను తెరిపించాలని కోరారు.  

అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదు: ఎంఎస్‌ ప్రభాకర్‌
ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఎంఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు.మరోమారు ఇలా జరుగకుండా చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement