చినుకు పడితే గుండె దడ దడ
వర్షాలు, గాలులకు తోడు భయపెడుతున్న పురాతన భవనాలు
నగరంలో అధికారులు గుర్తించినా కూల్చనివి 274
నిర్లక్ష్యం వీడకపోతే ప్రాణనష్టం తప్పదంటున్న నిపుణులు
సిటీబ్యూరో: క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నగరంలో బుధవారం మళ్లీ గాలివాన బీభత్సం సృష్టించింది. ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 100 కి.మీ ప్రచండ వేగంతో ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల భారీ వృక్షాలు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ తీగలు తెగిపడడంతో పలు శివారు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. ఎస్.ఆర్.నగర్ బీకేగూడాలో ఓ భారీ వృక్షం కూలి ఆటో ధ్వంసమైంది. సనత్‌నగర్ బస్టాప్ వద్ద ఓ దుకాణంపై భారీ వృక్షం కూలింది. అశోక్‌నగర్ కాలనీలో ఓ భవనంపై ఉన్న రేకులు ఎగిరి పక్కనే ఉన్న పెంకుటిల్లుపై పడడంతో ఆ ఇల్లు ధ్వంసమైంది. బేగంపేట్ రసూల్‌పురా భరణి కాంప్లెక్స్ వద్ద ఓ భారీ వృక్షం కూలి మూడు కార్లు ధ్వంసమయ్యాయి. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో ఓ భారీ వృక్షం కూలి రెండు కార్లు ధ్వంసమయ్యాయి. గాలివాన బీభత్సం నేపథ్యంలో బుధవారం సాయంత్రం జీహెచ్‌ఎంసీ మేయర్, వివిధ విభాగాల నోడల్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ అత్యవసర కాల్ సెంటర్‌కు అందిన ఫిర్యాదుల్లో.. విద్యుత్ సరఫరాలో అంతరాయంపై 26 ఫిర్యాదులు, చెట్లుకూలిన ఘటనపై 27 ఫిర్యాదులు అందినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. తక్షణం ఆయా సమస్యలను పరి ష్కరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్ధన్‌రెడ్డి సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. కాగా సాయంత్రం 8.30 గంటల వరకు1.06 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.
ట్రాఫిక్ జాంఝాటం..
సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గాలివాన రావడంతో అబిడ్స్, కోఠి, నాంపల్లి, లక్డికాపూల్, పంజగుట్ట, ఖైరతాబాద్, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట్, సికింద్రాబాద్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో వర్షపునీరు రహదారులపై నిలిచి ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. వాహనదారులు, ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ట్రాఫిక్‌లో చిక్కుకొని విలవిల్లాడారు. ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. కాగా మధ్యాహ్నం గరిష్టంగా 40.5 డిగ్రీలు, కనిష్టంగా 28.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ 89 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల 24 గంటల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదులు
బుధవారం సాయంత్రం కురిసిన వాన, ఈదురుగాలుల వల్ల 30 ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలిగినట్లు, 25 చెట్లు కూలిపోయినట్లు జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదులందాయి. దాంతో వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణశాఖ ద్వారా అందిని హెచ్చరికలతో ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌కు చేరుకోవాల్సిందిగా ఆయా విభాగాల నోడల్ అధికారులకు సమాచారమిచ్చారు. కేవలం పదినిమిషాల్లోనే తక్షణ చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించారని పేర్కొన్నారు. సీతాఫల్‌మండి, జూబ్లీహిల్స్, చిలుకలగూడ, లోయర్‌ట్యాంక్‌బండ్, ముషీరాబాద్ ఎమ్మార్వో కార్యాలయం, బంజారాహిల్స్ రోడ్డునెంబర్ 12 తదితర ప్రాంతాల్లో కూలిన చెట్లను వెంటనే తొలగించినట్లు పేర్కొన్నారు.
ఓయూ క్యాంపస్‌లో కూలిన చెట్లు
గాలివానతో బుధవారం ఓయూ క్యాంపస్ అతలాకుతలం అయింది. విపరీతమైన గాలికి పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి కిందపడగా, కరెంట్ తీగలు తెగి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. టెక్నాలజీ విద్యార్థుల హాస్టల్ పైకప్పుపై చెట్టు విరిగిపడడంతో సిమెంట్ రేకులు విరిగిపోయాయి. దీంతో వర్షం నీరు హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థుల పుస్తకాలు, దుస్తులు, ఇతర వస్తులు తడిచిపోయాయి.