మొబైల్‌లోనే ఆర్సీ, లెసైన్స్
♦ దేశంలో తొలిసారి ఎం-వాలెట్ యాప్ రూపొందించిన రవాణా శాఖ
♦ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
♦ ఇకపై పోలీసులు,ఇతర అధికారుల ఇబ్బందులు ఉండవన్న మంత్రి
♦ ఆర్సీ బుక్, డ్రైవింగ్ లెసైన్స్ మొబైల్‌లోనే చూపించవచ్చు: మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా రవాణాకు సంబంధించిన డాక్యుమెంట్లతో తెలంగాణ రవాణా శాఖ ఓ మొబైల్ వాలెట్ యాప్‌ను రూపొందించింది.రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు ఈ ఆర్‌టీఏ ఎం-వాలెట్ యాప్‌ను బుధవారం ఆవిష్కరించారు. పోలీ సులు లేదా రవాణా అధికారులు తనిఖీ చేస్తే మొబైల్‌లో ఉన్న ఈ యాప్‌ను ఓపెన్ చేసి అవసరమైన డాక్యుమెంట్లను వారికి చూపించవచ్చు. ప్రయాణిస్తున్న వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు డ్రైవింగ్ లెసైన్స్‌ను ఈ యాప్‌లో భద్రపరచుకోవచ్చు. దీని కోసం అన్ని రకాల ఆండ్రాయిడ్, విండో ఫోన్లలో ఆర్‌టీఏ ఎం-వాలెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యాప్ డౌన్‌లోడ్ కాగానే పేరు, మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ వెంటనే మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. దానిని నమోదు చేయగానే యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్‌లో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు వాహనం ఐదంకెల చాసిస్ నంబర్ నమోదు చేయగానే ఆర్‌సీ డౌన్‌లోడ్ అవుతుంది. ఇక డ్రైవింగ్ లెసైన్స్‌కు లెసైన్స్ నంబర్, పుట్టిన తేదీ, లెసైన్స్ పొందిన కార్యాలయం వివరాలను నమోదు చేయాలి. వివరాలు సరైనవైతే వెంటనే డ్రైవింగ్ లెసైన్స్ కూడా యాప్‌లోకి డౌన్‌లోడ్ అవుతుంది. కేటీఆర్ చేతుల మీదుగా ఈ యాప్ ఆవిష్కరణ అనంతరం మొదటగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి వాహనానికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో చూపించారు.
ఇక ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు: కేటీఆర్
తనిఖీల పేరుతో పోలీసులు వాహనదారులను రోడ్డుపై ఎక్కువసేపు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదని యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘నేను అమెరికాలో ఎనిమిదేళ్లు ఉన్నాను. అన్నేళ్లలో ఒకే ఒక్కసారి ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్లాను. మిగతా అన్ని అవసరాలు ఆన్‌లైన్ ద్వారానే అందుబాటులో ఉండేవి. అలాంటి పరిస్థితి ఇప్పుడు మన రాష్ట్రంలో రావాలని కోరుకుంటున్నాను. ఐటీ, రవాణా శాఖ ఉద్యోగులు సహకరిస్తే త్వరలోనే మన రాష్ట్ర ప్రజలు అలాంటి పరిస్థితిని చూస్తారు. ఇలాంటి అభివృద్ధికి సంబంధించి యువత తమ ప్రతిభను బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఎం-వాలెట్ యాప్ ఏదో పెద్ద ఎంఎన్‌సీ కంపెనీ తయారు చేయలేదు. మన హైదరాబాద్ యువకులే రూపొందించారు’’ అని మంత్రి తెలిపారు.
ఎం-వాలెట్ యాప్ వాడకం వల్ల వాహనదారులు డ్రైవింగ్ లెసైన్సులను, ఆర్‌సీ బుక్‌లను వెంటబెట్టుకోవాల్సిన అవసరం ఉండదని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎం-వాలెట్ రాష్ట్రంలోని కోటి 44 లక్షల వాహన యజమానులకు ఉపయోగపడనుందన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ యాప్‌లో వాహనాలకు సంబంధించి, యజమానులు డ్రైవింగ్ లెసైన్సులకు సంబంధించి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. తమ వెంట డాక్యుమెంట్లు తీసుకువెళ్లలేని వారికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని రవాణా శాఖ కార్యదర్శి సునీల్‌శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.