
ప్రాజెక్టుల అక్రమాలపై విచారణకు సిద్ధమా?
ప్రాజెక్టుల అక్రమాలపై సీఎం కేసీఆర్ విచారణకు సిద్ధం కావాలని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి సవాల్ చేశారు.
సీఎం కేసీఆర్‌కు నాగం సవాల్
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల అక్రమాలపై సీఎం కేసీఆర్ విచారణకు సిద్ధం కావాలని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి సవాల్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. అవినీతి రహితంగా, ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా పారదర్శకంగా ప్రాజెక్టులు పూర్తిచేయాలని కోరుతుంటే అడ్డుకుంటున్నట్టుగా సీఎం, మంత్రులు మాట్లాడటం సరికాదన్నారు.
ప్రాజెక్టులను పూర్తిచేయడం చేతకాని ప్రభుత్వం ప్రతిపక్షాలపై నిందలు వేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ప్రాజెక్టులకు కేటాయింపులు చేస్తున్నామని ప్రచారం చేసుకోవడం తప్ప ఖర్చు చేయడం లేదన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు జరిగిన కేటాయింపులు, చేసిన ఖర్చు ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు.
పాలమూరులోని ప్రాజెక్టులపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రూ.1000 కోట్లు కేటాయిస్తే పాలమూరులో 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా 8 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని చెబుతుంటే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు పట్టించుకోవడం లేదన్నారు. కుర్చీ వేసుకుని కూర్చొని, పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడెక్కడ పోయాడని నాగం ప్రశ్నించారు.