
సాక్షి, హైదరాబాద్: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొ రేషన్ (ఓఎన్‌జీసీ)లో నిర్దిష్ట కాలపరిమితితో 2008లో నియమితులైన ఫీల్డ్ ఆపరేటర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం వారు పనిచేస్తున్న పోస్టుల్లోనే కొనసాగించాలని 2016లో సింగిల్ జడ్జి చెప్పిన తీర్పును సమర్థించింది.
కాకినాడ ఓఎన్‌జీసీలో పని చేస్తున్న తమ సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలని తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఔట్‌సోర్సింగ్ ఫీల్డ్ ఆపరేటర్లు పిటిషన్లు దాఖలు చేశారు. వారి సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయాలని సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్ర రావు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓఎన్‌జీసీ అప్పీల్ చేసిన వ్యాజ్యాన్ని ఉమ్మడి హైకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎం.గంగా రావులతో కూడిన ధర్మాసనం కొట్టేసింది.