హైదరాబాద్ నగరంలోని ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణల తొలగింపు..
జీహెచ్‌ఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణల తొలగింపు, నిరోధానికి ఇప్పటికే పలు ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు, ఈసారి గట్టిగా స్పందించింది. వివిధ రకాల వస్తువులతో ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న వారిని ఖాళీ చేయాలంటూ హెచ్చరిక చేయాలని, ఒకవేళ వినకుంటే, వారి వస్తువులను స్వాధీనం పరచుకొని వాటిని బహిరంగ వేలంలో విక్రయించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను హైకోర్టు ఆదేశించింది.
ఇందుకు అవసరమైతే పోలీసుల సాయం కూడా తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గతవారం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సిద్ధి అంబర్ బజార్, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
దీన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆక్రమణల తొలగింపునకు ఆదేశాలు ఇచ్చినా అవి కొనసాగుతుండడాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తించింది. దీనిపై జీహెచ్‌ఎంసీ వివరణ కోరింది. ఈ కేసును సంక్రాంతి సెలవుల తరువాత తిరిగి విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది.