
రైతులపై ఇంత నిర్లక్ష్యమా?: రేణుక
సాక్షి, హైదరాబాద్: రైతులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమెందుకు అని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. రుణమాఫీ చేయకుండా, కరువులో పరిహారం ఇవ్వకుండా, వరద నష్టాన్ని అంచనా వేయకుండా, నకిలీ విత్తనాల నుంచి రక్షించకుండా రైతులపై కక్ష సాధించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
నకిలీ విత్తనాల కంపెనీలను బ్లాక్‌లిస్టులో పెట్టాలని, వాటి ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. వాటివల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పరిహారమివ్వాలన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరినందుకు అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టారన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరం గా ఉంటున్నట్లు కొందరు కాంగ్రెస్ నేతలే తనపై దుష్ర్పచారం చేస్తున్నారని రేణుక చెప్పారు.