ఆ నోటిఫికేషన్లను ఉపసంహరించం
అసెంబ్లీలో సీఎం స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: మచిలీపట్నం ఓడరేవు నిర్మాణానికి ప్రభుత్వం జారీ చేసిన భూ సేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకునే ఆలోచన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభకు తెలిపారు. శనివారం సభ్యులు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఓడరేవుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఓడరేవుల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్లను ఉపసంహరించుకునే యోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. మొదటి దశలో కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఓడరేవు, శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు ఓడరేవును త్వరితగతిన అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
ప్రోటోకాల్ పాటించకుంటే చర్యలు
ప్రభుత్వ కార్యక్రమాలకు శాసనసభ సభ్యులను ఆహ్వానించే అంశంలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా జవాబిచ్చారు.
2017 జూన్‌లో గుండ్ల బ్రహ్మేశ్వరం ప్రాజెక్టు పూర్తి: మంత్రి ఉమా
3,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి రామన్న కత్వా చెక్ డ్యాం దిగువన గుండ్ల బ్రహ్మేశ్వరం ప్రాజెక్టును డి జైన్ చేసినట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శాసనసభలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టును 2017 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యమని తెలిపారు.
లాటరీ పద్ధతిలో ప్లాట్లు: నారాయణ
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణ తుది మాస్టర్‌ప్లాన్‌ను అధికారికంగా ప్రకటించిన తరువాత... భూములిచ్చిన రైతులకు గరిష్టంగా 195 రోజుల్లో వారి వాటా ప్లాట్లను అప్పగిస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.నారాయణ ప్రకటించారు. శనివారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.