ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తారా?: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలవల్ల నష్టపోయిన రైతాం గాన్ని ఆదుకోవాలని, ఆ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై పీడీ చట్టం కింద కేసులు పెట్టాలని కోరినందుకు ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తోందని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీనేత రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నకిలీ విత్తనాలను సరఫరా చేసిన ఎన్ని కంపెనీలపై కేసులు పెట్టారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ బంధువులకు చెందిన కావేరి కంపెనీ సహా 8 నకిలీ విత్తన కంపెనీలకు నోటీసులిచ్చిన అధికారిణిని సెలవుపై పంపి, కొత్త అధికారిని నియమించడం దుర్మార్గమన్నారు. మిషన్ భగీరథ కింద తాగునీరు అందించినందుకు ప్రజలవద్ద డబ్బులు వసూలు చేసేలా రుణ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు.