
ఎమ్మెస్సార్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదు: రేవంత్
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా అభ్యర్థి ప్రకటన, ఖర్చుపై టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కేసీఆర్ పరిపాలనా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
కేసీఆర్ పాలనను పొడిగిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్‌ను ఆ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పాలనపై ఎమ్మెస్సార్... కాంగ్రెస్ మనసులో మాటను బయటపెట్టారన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే మురిగిపోయినట్లేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి అత్యధిక నిధులు తీసుకురావాలంటే ఎన్డీయే అభ్యర్థిని గెలిపించాలన్నారు.