బాలుడి వైద్యానికి రూ.25 లక్షలు
11 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్సకు సీఎం సాయం
సాక్షి, హైదరాబాద్: 11 నెలల పసిబాలుడికి వైద్య చికిత్సను అందించేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు మానవతా హృదయంతో స్పందించారు. కాలేయ మార్పిడికి అవసర మైన చికిత్సను అందించేందుకు సీఎం సహా యనిధి నుంచి రూ.25 లక్షలు మంజూరు చేశారు. గజ్వేల్‌కి చెందిన హనుమాన్ దాస్ కుమారుడైన దేవసాని శ్రీమాన్ పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు చేయించగా కాలేయానికి సంబంధించిన సమస్య తలెత్తిందని, కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారమని వైద్యులు చెప్పారు. దీంతో అంత ఖర్చు భరించలేని పేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
వివిధ పత్రికలలో వచ్చిన కథనాలతో ముఖ్యమంత్రి బాలుడి గురించి ఆరా తీశారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన వైద్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో కలెక్టర్ బాలుడి కుటుంబీకులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాలేయ మార్పిడికి రూ.25 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పటంతో స్పందించిన ముఖ్యమంత్రి సీఎం సహాయ నిధి నుంచి ఆ నిధులను మంజూరు చేశారు. అందుకు సంబంధించిన చెక్కును కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి తల్లిదండ్రులకు సోమవారం అందజేశారు.
‘సాక్షి’ సాయాన్ని మరచిపోలేం: శ్రీమాన్ తండ్రి
‘‘మాకొచ్చిన కష్టాన్ని ప్రపంచానికి తెలిసేలా సాక్షి పత్రిక కథనం ప్రచురించడం.. సీఎం కేసీఆర్ స్పందించడం కొండంత అండనిచ్చింది. సీఎం చొరవతో మా బాబు మంచి భవిష్యత్తును పొందుతాడనే నమ్మకం కలిగింది. దీనికి కారణమైన ‘సాక్షి’ మేలు మరచిపోలేం. సీఎంకి రుణపడి ఉంటాం’’ అని శ్రీమాన్ తండ్రి హనుమాన్‌దాస్ చెప్పారు.