ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల ఎదురుచూపులు..
నాల్గో రోజు రోడ్డెక్కిన బస్సులు 631
అన్ని డిపోల్లో కార్మికుల వంటా-వార్పు
8 ఎంఎంటీఎస్ {పత్యేక రైళ్లు నడిపిన ద.మ.రైల్వే
మే 14న ఎంసెట్‌కు {పత్యేక బస్సులపై ఆర్టీఏ కసరత్తు
నగరంలో ‘సమ్మె’ పాట్లు కొనసాగుతున్నాయి. శనివారం కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ యూనియన్ల ఆధ్వర్యంలో అన్ని డిపోల ఎదుట వంటా వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. యథావిధిగా ప్రైవేట్ వాహనదారుల దోపిడీ కొనసాగింది.
సిటీబ్యూరో : నాలుగు రోజులుగా అదేసీన్. ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతుండగా మరోవైపు ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. శనివారం నగరంలోని 28 డిపోలు, ప్రధాన బస్‌స్టేషన్‌లలో కార్మిక సంఘాలు వంట-వార్పు నిర్వహించి తమ ఆందోళన కొనసాగించాయి. అన్ని చోట్ల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ డిపో వద్ద జరిగిన కార్యక్రమంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ చెర్మైన్ కోదండరామ్ పాల్గొని ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 43 శాతం ఫిట్‌మెంట్ న్యాయమైన డిమాండ్ అని, యాజమాన్యం ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం,సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మహత్తర పోరాటాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్‌లు, బర్కత్‌పురా, కాచిగూడ,పికెట్, హయత్‌నగర్, రాణిగంజ్, జీడిమెట్ల, కుషాయిగూడ తదితర అన్ని డిపోల వద్ద కార్మికులు వంటా వార్పు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు ప్రైవేట్ కండక్టర్‌లు, డ్రైవర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సహాయంతో 4వ రోజు 631 సిటీ బస్సులు రోడ్డెక్కినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో ఉదయం,సాయంత్రం రద్దీ వేళల్లో నగర వాసులకు కొద్దిగా ఊరట లభించినప్పటికీ ఇబ్బందులు మాత్రం తప్పలేదు. లక్షలాది మంది ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. దీంతో ఆటోవాలాలు, ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీ పర్వం యధావిధిగా కొనసాగింది.
కిక్కిరిసిన ఎంఎంటీఎస్ రైళ్లు...
బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ఎంఎంటీఎస్ రైళ్లలో రద్దీ నెలకొంది. దీంతో దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ-నిజామాబాద్, మల్కాజిగిరి-మిర్యాలగూడ మార్గంలోనూ ప్రత్యేక రైళ్లు నడిచాయి. వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో అనూహ్యమైన రద్దీ నెలకొంది. ఇక దూరప్రాంతాలకు నడిచే ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. ఒక్క బస్సులే కాకుండా కార్లు, టాటా ఏస్ వంటి వాహనదారులు సైతం నిలువుదోపిడీ కొనసాగించారు.
ఎంసెట్‌కు 1000 బస్సులు: జేటీసీ రఘునాథ్
తెలంగాణలో ఈ నెల 14న ఎంసెట్ నేపథ్యంలో విద్యార్థులకు రవాణా సదుపాయాలపై ఆర్టీఏ అధికారులు శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు కూడా కార్మికులు సమ్మె విరమించకుండా కొనసాగిస్తే చేపట్టవలసిన ఏర్పాట్లపై హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ నేతృత్వంలో చర్చించారు. గ్రేటర్‌లోని 117 కేంద్రాల్లో ఇంజనీరింగ్, 30 కే ంద్రాల్లో మెడికల్ ఎంసెట్ పరీక్షలు జరుగనున్న దృష్ట్యా కనీసం 1000 బస్సులను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఆర్టీసీ బస్సులే కాకుండా, స్కూళ్లు, కళాశాలలు, కంపెనీలకు నడిచే బస్సులను కూడా సేకరించనున్నట్లు జేటీసీ రఘునాథ్ తెలిపారు. ఇప్పటి వరకు 500 మంది డ్రైవర్లను ఆర్టీసీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. నగరంలో నడిచేందుకు ప్రైవేట్ బస్సులకు రూ.100 ల ఫీజుతో తాత్కాలిక పర్మిట్లను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె దృష్ట్యా ఎంసెట్‌కు రవాణా సదుపాయాలపై మే 13వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.