రేపే ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు
- తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహణకు సిద్ధం
- ఓటుహక్కు వినియోగించుకోనున్న 49,600 మంది
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా జరుగుతున్న ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలు, కార్యాలయాలు, వర్క్‌షాపుల్లో పోలింగ్ జరగనుంది. 49,600 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. పది సంఘాలు పోటీలో నిలిచినా.. తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని అంచనా.
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చివరి ఎన్నికల్లో టీఎంయూ -ఈయూ కలసి పోటీ చేసి సంయుక్త విజేతలుగా నిలిచాయి. ప్రస్తుతం అవి వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. కాగా, గతంలో ఎన్నడూ లేనట్టుగా ఆర్టీసీలో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య తాజా కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. కార్మికులు ప్రతినెలా తమ వేతనం నుంచి కొంత మొత్తం కోత పెట్టుకుని పోగుచేసుకునే ‘కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ’ నిధులను, పదవీ విరమణ, కార్మికులు చనిపోతే అందే ఆర్థిక సాయం నిధులను కూడా ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకోవటంతో కార్మికులకు రుణా లు ఆగిపోయాయి.
వాటిని తిరిగి జమకట్టేం దుకు ఆర్టీసీ వద్ద నిధుల్లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవటంతో కార్మికుల కుటుంబా లు ప్రైవేటు అప్పులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో కార్మిక సంఘాలు విఫలమయ్యాయి. దీన్ని కార్మికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం టీఎంయూ అధికార టీఆర్‌ఎస్‌తో సఖ్యతగా ఉంటోందన్న ప్రచారముంది. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆర్టీసీ సమీక్షకు కేవలం ఆ సంఘం నేతలకే ప్రవేశం లభించటం గమనార్హం. ఇక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆ సంఘానికి అనుకూలంగా ప్రచారం చేశారు. ఆ సంఘం గెలిస్తే కార్మికుల పక్షాన ప్రభుత్వంతో పోరాడలేదని మిగతా సంఘాలు ప్రచారం చేస్తున్నాయి.
ఎవరి ధీమా వారిదే...
ఇతర సంఘాలు ఎన్ని ఆరోపణలు చేసినా చివరకు గెలుపు తమదేనని టీఎంయూ నేతలు విశ్వాసంతో ఉన్నారు. వేతన సవరణ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలలో బాండ్ల రద్దు, సర్వీసులో చనిపోయిన కార్మికులకు రికవరీ లేకుండా రూ.6 లక్షలు చెల్లింపు తదితర హామీలతో ఎన్‌ఎంయూ ధీమాగా ఉంది. కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, 44 శాతం ఫిట్‌మెంట్, గ్రేడ్ పే విధానం అమలు వంటివి తమ విజయాలేనని ఈయూ చెప్పుకొంటోంది.