రన్ సుజిత్ రన్ | Run Sujit Run | Sakshi
Sakshi News home page

రన్ సుజిత్ రన్

Published Mon, Aug 4 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

రన్ సుజిత్ రన్

రన్ సుజిత్ రన్

 ‘‘మీ అబ్బాయి పిచ్చి పిచ్చి సినిమాలేవో తీస్తున్నాడు. కాస్త జాగ్రత్త పడండి’’ అంటూ పొరుగింటావిడ చెబితే ఏ తల్లయినా ఏం చేస్తుంది? వామ్మో... అని కంగారు పడిపోయి బయట నుంచి కొడుకు ఇంటికి రాగానే వాడి పని జింతాత జితా జితా చేసేసి... అయిపోయిందండీ మనబ్బాయి పాడైపోయాడటండీ అంటూ భర్తకి గుమ్మం దగ్గర నుంచే ఆరున్నొక్క రాగంతో స్వాగతాలు పలికేసి...
 
 కట్... కట్... అంటూ కట్ చెప్పి ‘‘ఠాట్ మా అమ్మ అలాంటిది కాదు’’ అని డైలాగ్ కూడా చెప్పాడు సుజిత్. సారీ... టాలీవుడ్ దర్శకుడు సుజిత్. ‘లవ్‌లో లాజిక్‌లు’ పేరుతో నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు  పేరెంట్స్‌కి తెలీదు. రెండోది పూర్తవగానే చుట్టుపక్కలవాళ్లు మీవాడు చెడిపోతున్నాడు జాగ్రత్తని చెప్పేశారు. అయితే అమ్మ ఏం కంగారు పడకుండా నాకో కెమెరా కూడా కొనిచ్చింది. కాకపోతే చదువు చెడగొట్టుకోకు అని ఫినిషింగ్ టచ్ ఇచ్చింది’’ అంటూ గుర్తు చేసుకున్నాడీ కుర్రాడు. అలా పొట్టి చిత్రాలకు గట్టి పునాది లేనప్పుడే (పదేళ్ల క్రితం) దాని మీదకి ఎగిరి దూకిన ఈ అడ్వాన్స్‌డ్ అబ్బాయి... షార్ట్ ఫిల్మ్ సక్సెస్‌నే బేస్ చేసుకుని ఇప్పుడు ఏకంగా పెద్ద తెరపైకి వచ్చేశాడు. తాజాగా విడుదలైన ‘రన్ రాజా రన్’ ఈ అనంతపురం కుర్రాడు‘తెర’కెక్కించిందే. ఈ సందర్భంగా షార్ట్ టు బిగ్ దాకా తన రన్‌ను తనదైన స్టైల్‌లో వివరించాడు సుజిత్.

 ‘మాది అనంతపురం. స్కూల్ డేస్‌లో ఉన్నపుడు డిసిప్లిన్ కోసం చెన్నైలోని గురుకుల్ స్కూల్లో జేర్పించారు. అక్కడంతా సినిమా గోలే కదా దాంతో డిసిప్లిన్ సంగతేమోగానీ సినిమా పిచ్చి పట్టింది. ఆ తర్వాత మా ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చేశారు. 2006లో అమ్మ కొనిచ్చిన కెమెరాతో ‘లవ్ ఫెయిలైతే మళ్లీ లవ్ చెయ్’ అని  తీస్తే ఒక్కరోజులో లక్ష హిట్లొచ్చాయి. అప్పట్లో అది చాలా గొప్ప. దాంతో వీర కాన్ఫిడెన్స్ వచ్చింది. అక్కడి నుంచి సినిమాలు తీస్తూనే ఉన్నా. తెలుగులో, తమిళ్‌లో కూడా. తమిళ్‌లో తీసిన షార్ట్ ఫిల్మ్ ‘వేషం’ అవార్డ్ కూడా సాధించింది. ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అకాడ మీలో అసిస్టెంట్ కెమెరామెన్‌గా వర్క్ చేశా. అదే టైమ్‌లో ‘మిర్చి’ సినిమా తీసిన వాళ్లు కొత్త సినిమా చేస్తున్నపుడు నన్ను అడిగితే కథ చెప్పా. నచ్చింది. అదే రన్ రాజా రన్’ డైలీలైఫ్‌లో ఇన్సిడెంట్స్‌కి కామెడీ ని మిక్స్ చేసి క్యాజువల్ లుక్‌తో  నవ్వులు వండించే ఈ యువ కుక్‌కి బెస్టాఫ్ లక్ చెబుతూ... రన్ సుజిత్ రన్.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement