'శ్రీకాంతాచారి తల్లిని అవమానించారు'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్రని, పార్టీని పాతరెయ్యడం ఎవరికీ సాధ్యంకాదని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు టీఆర్ఎస్కు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం వల్లే మీకు తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన భార్య సుచరితా రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరితే ఇవ్వకపోవడం మానవత్వమా అని నిలదీశారు. భర్తను కోల్పోయిన మహిళను పరామర్శించడం కనీస సంప్రదాయమని, సుచరితారెడ్డికి ఇచ్చే గౌరవం ఇదేనా అని లేఖలో పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబసభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేదని, కానీ టీఆర్ఎస్ వాళ్లు మానవత్వం మరచి మరణించినవారిపై విమర్శలు చేయడం కుసంస్కారానికి నిదర్శనమని విమర్శించారు.
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతా చారి తల్లికి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయే సీటు ఇచ్చి అవమానించిందని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా ఆమెను ఎమ్మెల్సీని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఓడిపోయిన వారికి, ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారికి, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు వంటివారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని.. అమరవీరుల త్యాగం, ఓడిపోయిన శ్రీకాంతా చారి తల్లి గుర్తుకురాలేదా? ఇదేనా మానవత్వం అని దుయ్యబట్టారు. పాలేరులో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేకనే 10 మంది మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు అక్కడ తిష్టవేశారని, దీన్నిబట్టి కాంగ్రెస్ విజయం ఖాయమని జోస్యం చెప్పారు. అమలు కానీ హామీలతో ప్రజలను మభ్యపెడుతూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీఆర్ఎస్ను పాతరేయడానికి పాలేరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు లేఖలో హెచ్చరించారు.