సాక్షి/మెహదీపట్నం, న్యూస్‌లైన్ : నగరంలో నిర్మాణ రంగం పడకేసింది. ఇసుక కొరత వల్ల భారీ వెంచర్లే కాదు.. చోటామోటా ఇళ్ల నిర్మాణాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. మరోవైపు నిర్మాణ పనులు లేకపోవడంతో దినసరి కూలీలు రోడ్డున పడుతున్నారు. సీమాంధ్ర ప్రాంతాల నుంచి నగరానికి రావాల్సిన ఇసుక లారీలు సమ్మెలు, ఆందోళనల కారణంగా ఎక్కడికక్కడే నిలిచి పోయాయి.
తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చే ఇసుకైనా వస్తుందా అంటే వర్షాల కారణంగా రావాల్సిన స్థాయిలో రావటం లేదు. దీంతో ఇసుక కొరత తీవ్రంగా మారింది. ఇదే అదునుగా భావించిన ఇసుక వ్యాపారులు అక్రమంగా ఇసుకను తరలించి ధరలను విపరీతంగా పెంచేశారు. ఇప్పటికే పెరిగిన స్టీలు, సిమెంట్, రెడీమిక్స్ ధరలతో సతమతమౌతున్న ప్రజలు, బిల్డర్లకు ఇసుక ధర కూడా పెరగడం భారంగా మారింది. అమాంతం పెరిగిన ఇసుక రేట్లతో నగరంలోని పలువురు బిల్డర్లు ప్రస్తుతానికి నిర్మాణ పనులను పక్కన పెట్టేశారు.
నిలిచిపోయిన ఇసుక రవాణా..
నిర్మాణరంగ అవసరాల కోసం హైదరాబాద్‌కు ప్రతిరోజు సుమారు 60 వేల టన్నుల ఇసుక అవసరం. సీమాంధ్ర ప్రాంతాలైన రాజమండ్రి, తెనాలి, రావులపాలెం, కర్నూ లు, అమరావతి, విజయవాడ, దాములూరు, తెలంగాణ ప్రాంతాలైన మహబూబ్‌నగర్, అచ్చంపేట, నల్గొండ, డిండి, తిరుమలగిరి, వరంగల్, ఏటూరు నాగారం, నిజామాబాద్, కరీంనగర్‌ల నుంచి నగరానికి నిత్యం ఇసుక రవాణా జరుగుతుంది.
ఆయా ప్రాంతాల నుంచి ప్రతి రోజు సుమారు 3 వేల నుంచి 5 వేల లారీల ఇసుక తరలివస్తుంది. కానీ, ప్రస్తుతం సీమాంధ్రుల ఉద్యమం నేపథ్యంలో నగరానికి ఇసుక లారీలు రావడం లేదు. మరోవైపు భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదుల ప్రవాహం ఉధృతంగా ఉం డటంతో తెలంగాణ ప్రాంతాల నుంచి రావాల్సిన లారీలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఇదే అదునుగా భావించిన ఇసుక వ్యాపారులు ఇసుక ను అక్రమంగా తరలించి ధరలను అమాంతం పెంచేశారు.
జోరుగా అక్రమ దందా
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇసుకకున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. కర్మన్‌ఘాట్, చంపాపేట, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, ఈసీఐఎల్, కుషాయిగూడ, ఏఎస్‌రావు నగర్, సైనిక్‌పురి, తిరుమలగిరి, సుచిత్ర, మేడ్చల్, పాతముంబై రహదారి తదితర ప్రాంతాల్లో అక్రమ ఇసుక వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. రవాణా శాఖ నిబంధనలను అతిక్రమించి లారీల్లో ఇసుకను ఓవర్‌లోడ్ చేసి మరీ తరలిస్తున్నారు. నిబ ంధనల ప్రకారం లారీలో ఎంత లోడుందో తెలిపే ధ్రువీకరణ ప్రతం తప్పనిసరి. ధర్మ కాంటాలు (వే బ్రిడ్జి) నుంచి ఈ పత్రాలు తీసుకోవాలి.
అయితే ఈ ధర్మ కాంటాలు అధర్మకాంటాలుగా మారాయి. డబ్బులు తీసుకొని తప్పుడు తూకాలతో మాయాజాలం చేస్తున్నాయి. అధికలోడు ఉన్నా సరే డబ్బులు తీసుకొని కంప్యూటర్‌లో తారుమారు చేసి తక్కువ బరువు ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నాయి. ఓవర్‌లోడ్‌తో ఇసుక అక్రమంగా తరలిస్తుండటంతో కోట్లాది రూపాలయ వ్యయంతో నిర్మించిన రహదారులు ధ్వంసమవుతున్నాయి. అధిక లోడును నియంత్రించలేక లారీలు ప్రమాదాలకు గురవుతున్నాయి.
రాతి ఇసుకకు పెరుగుతున్న డిమాండ్
నది ఇసుక సరఫరా తగ్గిపోవటం, ధరలు చుక్కలనంటుతుండటంతో హైదరాబాద్ నిర్మాణ అవసరాల కోసం ప్రజలు, బిల్డర్లు ప్రత్నామ్యాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీంతో రోబో సాండ్ (రాతి ఇసుక)కు డిమాండ్ పెరిగిపోయింది. నది ఇసుకతో పోల్చుకుంటే రాతి ఇసుక ధరలు అందుబాటులో ఉండటంతో ఇటువైపు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం వాటి ధరలూ పెరిగిపోయాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 150 రోబోసాండ్ తయారీ యూనిట్లు వెలిశాయంటే రాతి ఇసుకకు పెరుగుతున్న గిరాకీని అర ్థం చేసుకోవచ్చు.
ఆగిన నిర్మాణాలు
పెరిగిన ఇసుక రేట్లను భరించి నిర్మాణాలను పూర్తి చేయడం భారంగా మారిందని పలువురు బిల్డర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు నిర్మాణాలు అసంపూర్తిగా ఆగిపోయాయి. నిర్మాణ రంగంపై ఆధారపడి నగరంలో నిత్యం వేలాది మంది జీవిస్తున్నారు. రోజూ కూలి చేస్తేనే వారి పొట్ట నిండుతుంది. ప్రస్తుతం సమైక్య ఉద్యమంతో నిర్మాణ రంగం నెమ్మదించడంతో అడ్డాకూలీలకు పనిదొరకని పరిస్థితి నెలకొంది. రెక్కాడితే గాని డొక్కాడని వీరి కుటుంబాలు పని దొరక్క పస్తుండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇసుక ధరలు తగ్గించాలి
నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో పనులు చేయలేక సగంలోనే నిర్మాణాలు నిలివేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికే స్టీలు, సిమెంట్ వంటి సామగ్రి ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇప్పుడు ఇసుక కూడా ఆ జాబితాలో చేరింది. సమ్మెల ప్రభావం ఇసుక లారీలపై పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇసుక ధరలు త గ్గేలా చర్యలు తీసుకోవాలి.
- వెంకట్, ఎస్‌వీ ప్లానర్ అధినేత
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
వర్షాల కారణంగా ఇసుక తవ్వకాలు జరగకపోవడంతో రేట్లు పెరిగిన మాట వాస్తవమే. అయితే సమ్మెల కారణంగా ఆ రేట్లు మరింత పెరిగాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని సమ్మెలతో లారీలు నిలిచిపోకుండా చూసుకోవాలి. లేకపోతే ముందుముందు చాలా ఇబ్బందులెదురవుతాయి.
- కొమ్మిరెడ్డి శ్రీధర్‌రెడ్డి,
హైదరాబాద్ లారీ యజమానుల సంఘం నాయకుడు
రేట్లు పెంచేస్తున్నారు
ఏ ప్రాంతంలో ఉద్యమాలు జరిగినప్పటికీ వాటి ప్రభావం రవాణా వ్యవస్థపై పడ కుండా చూసుకోవాలి. లేకుంటే కేవలం నిర్మాణ సామాగ్రికే కాకుండా కూరగాయలు, పెట్రోల్ వంటి నిత్యావసర వస్తువులపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇదే అదునుగా భావించి అక్రమంగా వస్తువులను తరలించి రేట్లను పెంచేస్తున్నారు.
- రామారావు, గ్రేటర్ హైదరాబాద్ భవన,
నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు
పస్తులుంటున్నాం
సాధారణంగా అడ్డా మీదకు వెళ్లగానే పని లభించేది. ప్రస్తుతం ఇసుక దొరకడం లేదన్న కారణంతో నిర్మాణాలు వాయిదా పడుతున్నాయి. దీంతో పనులు దొరకడం లేదు. నిత్యం రూ.200 కూలీ దొరికేది. గత 15 రోజుల్లో నాలుగు రోజులు మాత్రమే కూలి దొరికింది. మిగతా రోజులు ఇంటిల్లిపాది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
- రాంచందర్, గుడిమల్కాపూర్, కూలి
అరకొరగా ఇసుక సరఫరా, నిర్మాణ రంగం ఢమాల్
Published Sun, Sep 15 2013 2:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement
Advertisement