ఐఐటీల్లో పెరగనున్న సీట్లు | Seats increases in the IIT | Sakshi
Sakshi News home page

ఐఐటీల్లో పెరగనున్న సీట్లు

Published Tue, Mar 21 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

ఐఐటీల్లో పెరగనున్న సీట్లు

ఐఐటీల్లో పెరగనున్న సీట్లు

- వచ్చే విద్యాసంవత్సరంలో 1,500 వరకు పెరిగే అవకాశం
- మొత్తంగా ఐఐటీల్లో 11 వేలకు చేరనున్న సీట్ల సంఖ్య


సాక్షి, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరంలో (2017–18) ఐఐటీల్లో సీట్లు పెరగనున్నాయి. ఇప్పటికే కొన్ని ఐఐటీలు 550 వరకు సీట్ల పెంపునకు నిర్ణయం తీసుకోగా, మిగతా ఐఐటీలు కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తద్వారా దేశ వ్యాప్తంగా 1,500 వరకు సీట్లు పెరిగే అవకాశం ఉందని ఐఐటీ వర్గాలు పేర్కొన్నాయి. పెరిగిన సీట్లను వచ్చే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐటీల జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. దేశంలోని ఐఐటీల్లో 9,660 సీట్లు ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9,587 సీట్లు భర్తీ అయ్యాయి. 73 సీట్లు మిగిలిపోయాయి.

మిగిలిపోయిన సీట్లు దాదాపు పెద్దగా డిమాండ్‌ లేని కొన్ని కోర్సులకు సంబంధించినవేనని అధికారులు చెబుతున్నారు. తాజాగా డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో సీట్లను పెంచేందుకు ఐఐటీలు చర్యలు చేపట్టాయి.  2017–18 విద్యా సంవత్సరంలో ఐఐటీ హైదరాబాద్‌లో 40 సీట్లు, మండీలో 50, పట్నాలో 25, రోపార్‌లో 105, జమ్ము ఐఐటీలో 30 సీట్ల చొప్పున పెంచేందుకు గతంలోనే అవి చర్యలు చేపట్టాయి. మరోవైపు ఐఐటీ బాంబే, ఢిల్లీ, గువాహటి, ఖరగ్‌పూర్, కాన్పూర్, మద్రాసు, రూర్కీ ఐఐటీలు వచ్చే విద్యా సంవత్సరంలో సీట్లను పెంచబోమని గత ఏడాది స్పష్టం చేసినా, తాజాగా పెంపు దిశగా కసరత్తు చేస్తున్నాయి. అయితే మానవవనరుల అభివృద్ధి శాఖ సీట్ల పెంపుపై గత ఏడాదే ఆదేశాలు జారీ చేసినందున తాజాగా అవి కూడా పెంపుపై కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా బాంబే ఐఐటీ నాలుగేళ్ల బీటెక్‌ కోర్సులో 30 సీట్లు, ఎంటెక్‌లో మరి కొన్ని సీట్లు పెంచేందుకు కసరత్తు చేస్తోంది.

లక్షకు చేరనున్న విద్యార్థులు..
వచ్చే మూడేళ్లలో అంటే 2020 నాటికి ఐఐటీల్లో ప్రస్తుతం ఉన్న 72 వేల విద్యార్థుల సంఖ్యను లక్షకు పెంచాలని మానవవనరుల అభివృద్ధి శాఖ గత ఏడాదే ఆదేశాలు జారీ చేసింది. ఏటా 10 వేల చొప్పున (బీటెక్‌లో 4 వేల సీట్లు, ఎంటెక్‌లో 6 వేలు) సీట్లను పెంచాలని పేర్కొంది. సీట్ల పెంపుపై కేంద్రం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయ డంతో మిగతా ఐఐటీలూ పెంపుపై దృష్టి పెట్టాయి. మొత్తంగా వచ్చే విద్యా ఏడాదిలో  ఐఐటీల్లో సీట్లు 11 వేలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement