దక్షిణమధ్య రైల్వేకు ఏడు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే ఈ ఏడాది ఉద్యానవనాల పరిరక్షణలో అవార్డుల పంట పండించుకుంది. రాష్ట్ర ఉద్యానవనశాఖ నుంచి ఏకంగా ఏడు అవార్డులను అందుకుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యానవన శాఖ 2వ వార్షికోత్సవం సందర్భంగా రైల్వే అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు. 150 చదరపు మీటర్లకు పైగా ఉద్యానవనం ఉన్న దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా నివాస భవనం మొదటి బహుమతిని సొంతం చేసుకుంది. కిచెన్ గార్డెన్ విభాగంలో కూడా జీఎం నివాసం రెండో బహుమతిని సొంతం చేసుకుంది.
దక్షిణ లాలాగూడలోని హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అరుణాసింగ్ నివాసంలోని గార్డెన్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, ఎస్.ఎన్.సింగ్ నివాసం, చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ నివాసంలోని గార్డెన్‌లకు వరుసగా బహుమతులు లభించాయి. రూఫ్ గార్డెన్ విభాగంలో సికింద్రాబాద్ రైల్ నిలయం 2వ బహుమతిని అందుకుంది. మొత్తంగా 7 బహుమతులు దక్షిణమధ్య రైల్వేకు లభించడం పట్ల జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యానవనాల నిర్వహణ, పరిరక్షణలో అధికారులు, సిబ్బంది కృషిని అభినందించారు.