రెండు భారీ రైల్వే టెర్మినళ్లు | The two major railway terminals | Sakshi
Sakshi News home page

రెండు భారీ రైల్వే టెర్మినళ్లు

Published Thu, Apr 7 2016 4:22 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

రెండు భారీ రైల్వే టెర్మినళ్లు - Sakshi

రెండు భారీ రైల్వే టెర్మినళ్లు

♦ వట్టినాగులపల్లి, చర్లపల్లిలో ఏర్పాటు
♦ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించగానే పనులు మొదలు
♦ మనకు గతిమాన్ రైళ్లు రావటానికి ఆలస్యమవుతుంది
♦ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా
 
  సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రద్దీ, ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో నగరానికి రెండు వైపులా విశాలమైన రెండు భారీ టెర్మినళ్లు నిర్మించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా తెలిపారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచీగూడ రైల్వేస్టేషన్లు ఇరుకుగా మారిన నేపథ్యంలో వట్టినాగులపల్లి, చర్లపల్లి స్టేషన్లను విస్తరించి భారీ టెర్మినళ్లు నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఇటీవలి రైల్వే బడ్జెట్‌లో వాటికి అనుమతి మంజూరైనందున ఈ ఏడాదే పనులు మొదలుపెడతామన్నారు. చర్లపల్లిలో 150 ఎకరాలు, నాగులపల్లిలో 300 ఎకరాల స్థలం కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. ఆ కేటాయింపు జరగ్గానే పనులు మొదలుపెడతామని చెప్పారు. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన నేపథ్యంలో రైల్వే శాఖ చేపట్టబోయే పనుల వివరాలను రవీంద్ర గుప్తా బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు.

 రెండు బడ్జెట్లకు పూర్వం మనకు 2 గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మంజూరయ్యాయి. ఢిల్లీ-ఆగ్రా రైలు పట్టాలెక్కిన నేపథ్యంలో మనవి ఎప్పట్లోగా అందుబాటులోకొస్తాయి?
 ఢిల్లీ-ఆగ్రా మధ్య 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే గతిమాన్ సెమీ బుల్లెట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కినందున రెండేళ్ల క్రితం దక్షిణ మధ్య రైల్వేకు మంజూరైన ఇలాంటి రెండు రైళ్లపై దృష్టి మళ్లటం సహజం. కానీ అంత వేగంగా రైళ్లు దూసుకెళ్లేందుకు వీలుగా రైల్వే లైనును బలోపేతం చేయాల్సి ఉంది. ఢిల్లీ-ఆగ్రా మధ్య ఆ పని పూర్తయ్యాకనే రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్-చెన్నై, కాచిగూడ-నాగ్‌పూర్ గతిమాన్ రైళ్లు ప్రారంభం కావాలంటే లైన్ బలోపేతం జరగాలి.

 స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టుల ఏర్పాటు నత్త నడకకు కారణం?
 కొన్ని స్టేషన్లలో స్థలాభావం వల్ల పనుల్లో ఆలస్యమవుతోంది. కానీ ఇప్పుడు వేగిరం చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరం జోన్ పరిధిలో 7స్టేషన్లలో 9 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశాం. ఈ ఏడాది 12 ఎస్కలేటర్లు, 27 లిఫ్టులు ఏర్పాటు చేయబోతున్నాం.

 తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం ఆదాయం ఎలా ఉంది..?
 తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.13,212 కోట్లు(అంతకుముందు ఏడాది రూ.13,072 కోట్లు) దక్షిణ మధ్య రైల్వే ఆదాయాన్ని పొందింది. ఇందులో సరుకు రవాణా ద్వారానే రూ.9,225 కోట్లు ఉండగా, ప్రయాణికుల తరలింపు ద్వారా రూ.3,312 కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం కంటే ఆదాయం పెరగటం సంతోషంగా ఉంది. ఈసారి పెరుగుదల ఎక్కువగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. నిర్వహణ వ్యయాన్ని 78 శాతానికి కట్టడి చేయటం ద్వారా నష్టాలను తగ్గించగలిగాం.

 ఏపీకి ప్రత్యేక జోన్ అసలు ఉంటుందా..?
 అది రైల్వే బోర్డు పరిధిలో ఉన్న అంశం. బోర్డు నుంచి స్పష్టత వస్తే గాని దాని గురిం చి చెప్పలేం. దానిపై ఏర్పడ్డ కమిటీ సమర్పించిన నివేదికను బోర్డు పరిశీలిస్తోంది.

 రైళ్లు పరస్పరం ఢీకొనకుండా చూసే వ్యవస్థ ఎంతవరకు వచ్చింది?
 ఆర్‌డీఎస్‌వోతో కలసి సొంతంగా అభివృద్ధి చేసిన పరిజ్ఞానం ఇది. ప్రయోగాత్మకంగా వికారాబాద్-వాడీ సెక్షన్‌లో పరిశీలించినప్పుడు విజయవంతమైంది. నేను కూడా కొద్ది రోజుల క్రితం పరిశీలించాను. త్వరలో దీనికి రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తుంది.
 
 యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరణలో జాప్యం జరుగుతుందనే అభిప్రాయం ఉంది.. మీరేమంటారు?
 శివారు ప్రాంత ప్రజలు సులభంగా నగరంలోకి వచ్చి వెళ్లేందుకు వీలుగా ఎంఎంటీఎస్ రెండో దశ  పనులను వేగంగా జరుపుతాం. ఈ ప్రాజెక్టులో లేనప్పటికీ కొత్తగా యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను విస్తరించే పనికి శ్రీకారం చుట్టాం. ఈ పనుల నిర్వహణ బాధ్యతను ఆర్‌వీఎన్‌ఎల్ సంస్థకు అప్పగించమని బోర్డు ఆదేశించింది. వీలైనంత తొందరలోనే పనులు మొదలవుతాయి.
 
 కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఇక రానట్టేనా..?
 గతంలో కాజీపేటకు వ్యాగన్ ఫ్యాక్టరీ మంజూరు చేసిన మాట నిజమే. కానీ తాజా బడ్జెట్‌లో దాన్ని మార్చి వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ కేటాయించారు. దీని పనులు వెంటనే మొదలుపెడతాం. ప్రాథమిక స్థాయి పనుల కోసం తాజా బడ్జెట్‌లో రూ. 20 కోట్లు కేటాయించారు. ఈసారి దీని విషయంలో జాప్యం లేకుండా చూస్తాం.
 
 కొత్త లైన్లు, ట్రిప్పింగ్ పనుల్లో వేగం లేకపోవడం ఆందోళన కలిగించట్లేదా?
 దానికి కారణాలనేకం. దేశవ్యాప్తంగా ఆయా పనులకే పరిమితంగా నిధులు అందుతాయి. ప్రాధాన్యతాక్రమంలో వాటిని కొనసాగిస్తాం. ఇటీవల 177 కి.మీ. మేర కొత్త లైన్లు/ట్రిప్లింగ్ చేశాం. జగిత్యాల-మోర్తాడు, ఎర్రగుంట్ల-బనగానపల్లి, మేళ్లచెరువు-మాతంపల్లి, మందమర్రి-మంచిర్యాల, రామగుండం-పెద్దంపేట పరిధిలో వేగంగానే  పనులు సాగాయి. గుత్తి-ధర్మవరం మధ్య ఎలక్ట్రిఫికేషన్ పూర్తయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement