ఆకాశహర్మ్యాలన్నీ గాలిమేడలేనా: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిందని, పాలనలో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గ్రేటర్ హైదరా బాద్ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ ఇచ్చిన 60 హామీల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు.
మంత్రి కేటీఆర్ చెప్పిన 100 రోజుల ప్రణాళిక ఏమైందని ప్రశ్నించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామని పేదలకు హామీ ఇచ్చారని.. ఐదున్నర లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే.. కేవలం 350 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారన్నారు. ఆకాశహర్మ్యాలు, ఆకాశ మార్గాల వంటివన్నీ గాలిమేడలేనా అని ప్రశ్నించారు. లవ్ సిటీ, సేఫ్ సిటీ, క్లీన్ సిటీ అని హైదరాబాద్‌ను ఆగం చేశారన్నారు.